
నకిలీ విలేకరిపై ఎస్పీకి ఫిర్యాదు
కడప అర్బన్ : సింహాద్రిపురం, బ్రహ్మంగారిమఠం, రాజంపేట, గువ్వలచెరువు ప్రాంతాలలో టీవీ9 విలేకరి అంటూ బెదిరింపులకు దిగుతున్న పలుగురాళ్లపల్లె గ్రామానికి చెందిన ఓబులేష్ యాదవ్‌పై ఆ ఛానెల్ సిబ్బంది శుక్రవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. టీవీ9 పేరు చెప్పుకొని ఇతను చేసే వ్యవహారాలన్నీ ఉమ్మడి కడప జిల్లా సీనియర్ కరస్పాండెంట్ సుధీర్ కు సమాచారం అందడంతో ఈ విషయాన్ని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే స్పందించిన ఎస్పీ బ్రహ్మంగారిమఠం పిఎస్ లో అతనిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఓబులేష్ యాదవ్ అనే వ్యక్తి పై ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో టీవీ9 కడప జిల్లా సిబ్బంది సురేష్ బాబు (ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు) సురేష్ (జిల్లా కార్యవర్గ సభ్యుడు), సుబ్బారెడ్డి, కార్తీక్‌లు వున్నారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని
ఒకరికి తీవ్ర గాయాలు
రామసముద్రం : రామసముద్రం మండలం దాసర్లపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామసముద్రం బోయ వీధికి చెందిన అశోక్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం రామసముద్రం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.