
అదనపు కట్నం కోసం వేధింపులు
వేంపల్లె : స్థానిక శ్రీరాంనగర్‌లో నివాసముంటున్న వరలక్ష్మి అనే మహిళను ఆమె భర్త రవి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేముల మండలం దుగ్గన్నగారిపల్లెకు చెందిన గంగోజి, గీత దంపతుల కుమార్తె వరలక్ష్మికి వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు దేరంగులరవితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు మన్విక ఉన్నది. ప్రస్తుతం మూడు నెలల గర్భవతిగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. గత కొన్ని నెలలుగా వరలక్ష్మి భర్త రవి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. అయితే ఈనెల 2వ తేదీన ఆమె తల్లిదండ్రులు వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా బాధితురాలి భర్త రవికి స్థానిక టీడీపీ నేతల అండదండలు ఉండడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఆ తర్వాత కడప మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తన ఇంటి వద్దకు వచ్చిన వరలక్ష్మి భర్త డేరంగుల రవి, అతని చిన్నాన్న కొడుకు కృష్ణమూర్తి, తండ్రి వెంకటసుబ్బయ్య, చిన్నాన్న వెంకటరమణలు వరలక్ష్మిని విచక్షణ రహితంగా కాలితో కడుపుపైన కొట్టారన్నారు. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో రోస్టర్ విధానం అమలు చేయాలి
పులివెందుల టౌన్ : ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో రోస్టర్ విధానం అమలు చేయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడిపల్లి కిశోర్ కోరారు. గురువారం పట్టణంలోని స్థానిక ఎస్‌పీఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పునరాలోచించి రోస్టర్ విధానం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లలో అవకాశం ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో మార్కులను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవకాశాలు ఇచ్చేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేవిధంగా అవకాశం ఇస్తే విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
భవనం మీద నుంచి కింద పడి
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి
కడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాయపాటి ఖాజావలీ (50) ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి కిందపడి మృతి చెందినట్లు చిన్నచౌక్ ఎస్‌ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు గురువారం సాయంత్రం కడప అశోక్ నగర్ లోని తమ ఇంటి సిమెంటు రేకులపై వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ పట్ట కప్పేందుకు తన భార్యతో కలిసి పైకి ఎక్కారు. ఇద్దరూ పట్ట కప్పుతుండగా ఖాజావలీ నిలుచున్న ప్రదేశంలో ప్రమాదవశాత్తు సిమెంటు రేకులు విరగడంతో పైనుంచి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో రక్త గాయమై ముక్కు నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతని భార్య బంధువులతో కలిసి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనికి భార్య మాబున్నీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రేపు జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఈనెల 28న కడప జిల్లా కోర్టులో గల కడప బార్ అసోసియేషన్ హాలులో భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష నిర్వహించనున్నట్లు భారత న్యాయవాదుల సంఘం కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఇ.సుబ్రహ్మణ్యం కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. ఈశ్వర్ తెలిపారు. గురువారం నగరంలోని బసవతారకం లా కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు హాజరు కానున్న యువ న్యాయవాదులకు ఈ మోడల్ టెస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కడప బార్ అసోసియేషన్ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 99633 28876, 70137 40055, 94411 21181 నంబర్లకు ఫోన్ చేసి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

అదనపు కట్నం కోసం వేధింపులు

అదనపు కట్నం కోసం వేధింపులు