
గ్రేడ్ –2 జేఎల్‌ఎంల బదిలీల ఉపసంహరణ
కడప కార్పొరేషన్ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న గ్రేడ్–2 జేఎల్‌ఎంల బదిలీలను ప్రభుత్వం ఉపసంహరించిందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగసుబ్బయ్య తెలిపారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ ఉద్యోగుల విధివిధానాలను అనుసంధానం చేస్తూ ఈపీడీసీఎల్ ఇచ్చిన ఉత్తర్వులు సరి కాదని, గ్రేడ్–2 జేఎల్‌ఎంలను విద్యుత్ ఉద్యోగులతో సమానంగా చూడాలని, విద్యుత్ సంస్థ సర్వీసు రెగ్యులేషన్స్, ఆ సంస్థ నిర్వహించే బదిలీలే వారికి కూడా వర్తిస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. ఈ మేరకు గ్రేడ్–2 జేఎల్‌ఎంల బదిలీలను నిలుపుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, కడప డివిజన్ నాయకులు సురేంద్ర, శివ ప్రసాద్ రెడ్డి, గోపి, శీలం సుబ్బరాయుడు నందీశ్వర్ రెడ్డి, నాగ శేష, రమణాచారి, శివ, నిఖిల్, పాల్గొన్నారు.