
సీటు వదలని అక్రమార్కుడు!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : సాధారణంగా ఎవరైనా ఎనిమిదేళ్లు ఒక చోట పనిచేస్తే ప్రభుత్వం నిర్వహించే బదిలీల్లో కచ్చితంగా స్థాన చలనం పొందాలి. కానీ కడప ఇంటర్మీడియట్ డీఐఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఎనిమిది సంవత్సరాలు సర్వీసు పూర్తి కావడంతో ఇటీవల నిర్వహించిన బదిలీల్లో పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ చేశారు. దీంతో ఆయన ఈ నెల 13వ తేదీ పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధుల్లో చేరారు. అయితే ఇంతవరకు కళాశాలకు వెళ్లకుండా అనధికారంగా డీఐఈఓ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అలా కొనసాగడానికి తగిన ఉత్తర్వులు కూడా లేవు. ఇతను బదిలీ అయినా తిరిగి డిప్యుటేషన్ మీద డీవీఈఓ ఆఫీసుకు తెచ్చుకునేందుకు తగిన ప్రతిపానదలను ఆర్‌జేడీకి సంబంధం లేకుండా కమిషనర్ కార్యాలయానికి నేరుగా డీఐఈఓ కార్యాలయం నుంచి వెళ్లినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల పోరుమామిళ్ల నుంచి డిప్యుటేషన్ మీద డీవీఈఓ ఆఫీసుకు తెచ్చుకునేందుకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. అలా కూడా చేయకుండా అనధికారికంగా డీఐఈఓ కార్యాలయంలోనే కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈయన జిల్లాలోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చేసేందుకు కూడా మామూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డీఐఈఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్‌కు బదిలీ అయినా తిరిగి డీఐఈఓ కార్యాలయంలో కొనసాగించే విషయంపై విద్యార్థి సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీఐఈఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఈ జిల్లాకు తాను కొత్తగా వచ్చానని, ఈయన సేవలు కార్యాలయంలో తనకు అవసరం కనుక ఇక్కడే కొనసాగించుకుంటున్నానని తెలిపారు. ఇతనిని డీఐఈఓ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై తెచ్చుకునేందుకు ప్రతిపాదనలు కూడా పంపామని తెలిపారు.
పోస్టింగ్ పోరుమామిళ్లలో..
పనిచేసేది కడప డీఐఈఓ ఆఫీసులో
బదిలీ వచ్చినా అక్కడికి వెళ్లి చేరి మళ్లీ డీఐఈఓ ఆఫీసులోనే విధులు