
పాఠశాల తరలించవద్దు
కడప సెవెన్‌రోడ్స్ : తమ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రాథమిక పాఠశాలను తరలించవద్దని అట్లూరు మండలం కుంభగిరి పంచాయతీలోని రంగంపల్లె కాలనీ వాసులు డిమాండ్ చేశారు. పాఠశాల తరలింపునకు నిరసనగా సోమవారం ఆ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ పాఠశాలను చెన్నంపల్లె నుంచి ఎస్.వెంకటాపురం గ్రామానికి తరలించారన్నారు. ఆ గ్రామానికి పిల్లలు వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదని, చుట్టూ కంపచెట్లు ఉన్నాయని, ఇందువల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే చెన్నంపల్లె గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను కొనసాగిస్తే 350 కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. అధికారులు తమ సమస్యను దృష్టిలో ఉంచుకుని పాఠశాలను చెన్నంపల్లెలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు.
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు రెండవ రోజు కొనసాగాయి. కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో కడప జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కడప జట్టు 399 పరుగులు చేసింది. సోమవారం రెండవ రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 31.3 ఓవర్లలో 97 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. చిత్తూరు జట్టులో లోహిత్ లక్ష్మీ నారాయణ 22 పరుగులు చేశాడు. కడప జట్టులోని చరణ్‌రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. శివశంకర్ 2 వికెట్లు, ఆర్దిత్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 44.1 ఓవర్లలో 169 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. కడప జట్టులోని కుళ్లాయప్ప 37, ఆర్దిత్ రెడ్డి 35 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని తేజేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. సాయి చరణ్ 2 వికెట్లు, ప్రకాశ్‌రాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం చిత్తూరు జట్టు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీసీ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 362 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 123.3 ఓవర్లలో 464 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సయ్యద్ షాహుల్ హమీద్ 89, చైతన్య తేజ 72 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సౌషన్ కళ్యాణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 46.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 49, రోహిత్ 38 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని తోషిత్ యాదవ్ బౌలింగ్‌లో రాణించి 5 వికెట్లు తీశాడు. తేజ, భార్గవ్ మహేష్ రెండేసి వికెట్లు తీశారు.
మా కుమారుడిని క్షమాభిక్షపై విడుదల చేయండి
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఒక హత్య కేసులో గత 15 ఏళ్లుగా కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న తమ కుమారుడు జి.యుగంధర్ (ఖైదీ నెంబర్ 3980)ను క్షమాభిక్షపై విడుదల చేయాలని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన జి.చెంగమ్మ వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. హోం మంత్రి అనితలకు వినతి పత్రాలను పంపారు. వివరాలు ఇలా.. తన కుమారుడు యుగంధర్ జైలులో డిగ్రీ, పీజీ ఎం.ఏ సోషియాలజీ చదివి బంగారు పతకం సాధించాడన్నారు. మూడేళ్లుగా పీఎల్‌వీగా పనిచేసి జడ్జి మన్ననలు పొందారన్నారు. తన కుమారుడు జైలుకు వెళ్లడం వల్ల తన భర్త కుమారుడి మీద బెంగతో మరణించాడన్నారు. గత ప్రభుత్వంలో తాను, తన భర్త పలుమార్లు అర్జీలు సమర్పించామని తెలిపారు. తన కుమారుడిని విడుదల చేసేందుకు యూ/ఎస్ 364 ఐటీసీ, 302 ఐటీసీ, మైనర్ల సెక్షన్లు అడ్డుపెట్టి విడుదల కాకుండా గత 15 ఏళ్లుగా కడప జైలులో ఉంచారన్నారు. తన భర్త మరణించిన తర్వాత కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 65 ఏళ్లు ఉండటం వల్ల కళ్లు సరిగా కనిపించడం లేదని, మెరుగైన వైద్యం చేయించేవారు ఎవరూ లేరని తన కుటుంబానికి తన కొడుకే దిక్కు అని తెలిపారు. మానవతా దృక్పథంతో తమ కుమారుడికి క్షమా భిక్ష ప్రసాదించి విడుదల చేయాలని ఆమె కోరారు.
రిమ్స్‌లో అనాథ మృతదేహం
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప రిమ్స్ మార్చురీలో అనాథ మృతదేహం ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12వ తేదీ ఆర్‌కే నగర్‌కు చెందిన యు.బాల వెంకటేష్(68) అనే పేరుతో ఓ వ్యక్తిని రిమ్స్‌లో అడ్మిట్ చేశారన్నారు. ఆయన సోమవారం మృతి చెందాడన్నారు. మృతునికి సంబంధించిన వారు రిమ్స్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.