ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎంపీపీపై దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎంపీపీపై దాడి

Jun 24 2025 3:47 AM | Updated on Jun 24 2025 3:47 AM

ప్రొద

ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎంపీపీపై దాడి

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్‌యాదవ్‌, ఆయన సతీమణి సోములవారిపల్లె సర్పంచ్‌ శాంతిపై సోమవారం రాత్రి టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఖాదర్‌బాద్‌లో ఉన్న తమ స్థలంలోని నిర్మాణాలను కూలుస్తున్నారని సమాచారం తెలియడంతో శేఖర్‌యాదవ్‌ దంపతులు హుటా హుటీన ఘటనా వెళ్లారు. అక్కడికి వెళ్లగానే 19 వార్డు కౌన్సిలర్‌ మునీర్‌, కొత్తపల్లె సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే రూరల్‌ పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పెద్ద గండం తప్పినట్లైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సానబోయిన శేఖర్‌యాదవ్‌ ఆరు నెలల క్రితం కొత్తపల్లె పంచాయతీలోని ఖాదర్‌బాద్‌ గ్రామంలో 489–2 సర్వే నంబర్‌లో 10 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇటీవల తాత్కాలిక షెడ్డు పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 19 వార్డు కౌన్సిలర్‌ మునీర్‌, శివచంద్రారెడ్డి అనుచరులు ఆ నిర్మాణాలను రాడ్డులతో కూల్చే ప్రయత్నం చేశారు. అయితే రాడ్డులతో నిర్మాణాలు కూలకపోవడంతో జేసీబీని తెప్పించారు. అప్పటికే విషయం తెలుసుకున్న ఎంపీపీ సానబోయిన శేఖర్‌యాదవ్‌, ఆయన భార్య సర్పంచ్‌ శాంతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎందుకు కూలుస్తున్నారని వారిని ప్రశ్నిస్తుండగా ఇక్కడ నీ స్థలం ఎక్కడ ఉందంటూ టీడీపీ నాయకుల అనుచరులు వారిపై దాడి చేశారు. విషయం తెలియడంతో ప్రొద్దుటూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బంగారురెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సూచన మేరకు ఎంపీపీ శేఖర్‌యాదవ్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తనతో పాటు తన సతీమణి ఎస్సీ కులస్తురాలైన శాంతిని కులం పేరుతో ధూషించారని శేఖర్‌యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘వరద’ రాజ్యంలో విధ్వంసం ..

తాను శాంతి కాముకుడను.. నిజాయితీగా పని చేస్తానని ఎప్పుడు గొప్పలు చెప్పుకునే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నియోజకవర్గంలో ఆయన అనుచరులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఎంపీపీ శేఖర్‌యాదవ్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక బీసీ ఎంపీపీతో పాటు దళిత మహిళా సర్పంచ్‌పై దాడికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిలు చెప్పే మాటలకు, జరిగే సంఘటనలకు సంబంధం ఉండదన్నారు. ఆరు నెలల క్రితం ఖాదర్‌బాద్‌లో టీడీపీ నాయకుల వద్దనే 10 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. కొత్తపల్లె పంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్‌ కొనిరెడ్డి చంద్రారెడ్డి, కౌన్సిలర్‌ మునీర్‌లు కలిసి సబ్‌రిజిస్టర్‌ కార్యాలయానికి సంబంధించిన సీళ్లను తయారు చేశారన్నారు. ఇప్పుడు వెళ్లి చూసినా పంచాయతీ కార్యాలయంలో దొంగ సీళ్లు ఉంటాయన్నారు. వాటి ద్వారా ఫేక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి స్థలాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కొండారెడ్డి చెప్పారని ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి కేసును పట్టించుకోలేదన్నారు. రెండు నెలలుగా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నానన్నారు. తన స్థలం వద్దకు వెళ్తే ఇది శివచంద్రారెడ్డి అడ్డా అంటూ తమపై దాడి చేశారని తెలిపారు. షరీఫ్‌, గౌస్‌, మునీర్‌ తమ్ముడు, మరో 15 మంది శివచంద్రారెడ్డి అనుచరులు తమపై దాడి చేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

స్థల వివాదంలో ఎంపీపీ, ఆయన సతీమణి శాంతిపై దాడి చేసిన టీడీపీ అనుచరులు

కొత్తపల్లె పంచాయతీ కార్యాలయంలోనే సబ్‌రిజిష్టర్‌ ఆఫీసు సీళ్లు తయారి

తద్వారా తప్పుడు డాక్యుమెంట్లను

సృష్టించిన టీడీపీ నాయకులు

మీడియాతో ఎంపీపీ శేఖర్‌యాదవ్‌, ఆయన సతీమణి సర్పంచ్‌ శాంతి

ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎంపీపీపై దాడి1
1/1

ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎంపీపీపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement