
అర్జీలకు సకాలంలో పరిష్కారం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజలు సమర్పించే అర్జీలను సకాలంలో పరిష్కరించి న్యాయం చేయాలని డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పరిష్కార నిమిత్తం పంపారు.
● జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వార్డెన్ల అక్రమాస్తులపై ఏసీబీ దాడులు చేయించాలని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎం ఓబులేశు యాదవ్, ఏపీ దళిత మిత్ర సంఘం అధ్యక్షుడు కె.రామాంజనేయులు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. హాస్టళ్లలో కనీస వసతులు లేవని, మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, ఖాజీపేట ప్రాంతాల్లో కొంతమంది వార్డెన్లకు రెండు, మూడు హాస్టల్స్ ఇన్‌ఛార్జిగా ఇవ్వడంతో అవినీతికి ఆస్కారం కలుగుతోందన్నారు. అధికారులకు ఇవ్వాలంటూ ప్రతినెల ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ. 50–100 వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
● భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిన జిల్లా మైనార్టీ శాఖ అధికారి ఇమ్రాన్‌ను సర్వీసు నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్‌ఏ సత్తార్, నజీర్ అహ్మద్, ఆప్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ(ఎంఎల్) జిల్లా కన్వీనర్ ఓబయ్య తదితరులు కోరారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఇమ్రాన్‌ను డిప్యుటేషన్‌పై జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా నియమించి వక్ఫ్‌బోర్డు బాధ్యతలు కూడా అప్పగించారన్నారు. ఆ శాఖకు చెందిన రూ. 3.70 కోట్ల నిధులు బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని తినేశారని ఆరోపించారు. ఆయనపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా డబ్బు రికవరీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, డీఈఓ షంషుద్దీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.