
డీసీసీబీ చైర్మన్‌గా సూర్యనారాయణరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప : కడప డీసీసీబ్యాంకు చైర్మన్‌గా అట్లూరు మండలానికి చెందిన ఎం సూర్యనారాయణరెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేమలూరు గ్రామానికి చెందిన ఆయన కాంట్రాక్టర్‌గా బెంగుళూరులో స్థిరపడ్డారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి పోయే సూర్యనారాయణరెడ్డిని డీసీసీబ్యాంకు చైర్మన్‌గిరి వరించింది. కడప పార్లమెంటు పరిధిలో డీసీసీబీ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి, రాజంపేట పార్లమెంటు పరిధిలో డీసీఎంఎస్ చైర్మన్ కాపు సామాజిక వర్గం ద్వారా నియమించాలనే దిశగా సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డీసీఎంఎస్ చైర్ పర్సన్‌గా రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జయప్రకాష్‌ను నియమించారు.
చక్రం తిప్పుతున్న వాసు...
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చక్రం తిప్పుతున్నారు. సూర్యనారాయణరెడ్డికి డీసీసీబీ చైర్మన్ ఎంపిక కావడం వెనుక తెరవెనుక ప్రోత్సాహం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బద్వేల్‌పై కన్నెసి ఉంచిన ఆయన టీడీపీ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డికి చాపకింద నీరులా వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. అవకాశం వస్తే ఒక్కమారుగా రితేష్‌రెడ్డి వ్యతిరేకులంతా శ్రీనివాసులరెడ్డి చెంతన చేరిపోయేలా పథక రచన చేస్తున్నట్లు సమాచారం. పార్టీకి చేసిన సేవా, సమర్థత కంటే ఆర్థిక బలం ఉన్న సూర్యనారాయణరెడ్డి లాంటి వారిని చేరదీస్తున్నట్లు పలువురు వివరిస్తున్నారు. దూరదృష్టితో ప్రతి సందర్భంలోనూ వ్యవహారం తనకు అనువుగా మల్చుకుంటున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
నమ్ముకున్న వారికి గుండు సున్నా
తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు అధినేత చంద్రబాబు ఎగనామం పెట్టారు. నామినేటెడ్ పోస్టులు భర్తీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించే సూర్యనారాయణరెడ్డి లాంటి వారికి డీసీసీబీ చైర్మన్‌గిరి లభించింది. వేమలూరు గ్రామం మినహా మండల స్థాయిలో కూడా ఇప్పటికీ రాజకీయాలు నెరపని సూర్యనారాయణరెడ్డికి పదవి లభించడం వెనుక ఆర్థిక స్థోమత మాత్రమే గుర్తించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా జీవితాంతం టీడీపీ జెండా మోస్తూ వచ్చిన నేతలను కనీస పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. డబ్బున్న నేతల్ని ఎంచుకొని నామినేటెడ్ పదవులు అప్పగిస్తున్నారు. పార్టీనే నమ్ముకొని అంటిపెట్టుకొని వస్తున్న సింగారెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, హరిప్రసాద్, అమీర్‌బాబు లాంటి నేతలు జిల్లా కేంద్రంలో అర్హులుగా ఉన్నప్పటికీ కనీస పరిగణలోకి తీసుకోలేదని పలువురు వివరిస్తున్నారు. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా జమ్మలమడుగు నుంచి జంబాపురం రమణారెడ్డి, ప్రొద్దుటూరు నుంచి ఈవీ సుధాకరరెడ్డి, పులివెందుల నుంచి పేర్ల పార్థసారధిరెడ్డిలాంటి వారు అర్హులైనప్పటికీ వారిని పరిగణలోకి తీసుకోకపోవడంపై పలువురు టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బెంగుళూరులో స్థిరపడ్డ సూర్యనారాయణ రెడ్డికి చైర్మన్‌గిరీ
జిల్లాలో టీడీపీ జెండా మోసిన
నాయకులకు రిక్తహస్తం
డీసీఎంఎస్ చైర్మన్‌గాజయప్రకాష్