భారీగా నామినేషన్లు
ఏకగ్రీవానికి ప్రయత్నాలు
ఫ ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
ఫ నేటి నుంచి మూడో విడత షురూ
ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
సాక్షి, యాదాద్రి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగియనుండంతో పెద్ద ఎత్తున బేరసారాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. అయితే మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. కాగా ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలైయ్యారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల నేతలు, ఆశావహులు తీరిక లేకుండా గడుపుతున్నారు.
టోకెన్లు తీసుకుని..క్యూలో నిలబడి
రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలలోపు క్లస్టర్ కేంద్రాలకు చేరుకున్న వారికి అధికారులు టోకెన్లు ఇచ్చి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు. వార్డు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కాస్త జాప్యం జరిగింది.
మూడో విడత నేటి నుంచే..
గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మండలాల వారీగా కలెక్టర్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో క్లస్టర్ల వారీగా 124 గ్రామ పంచాయతీలు, 1,086 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తారు. భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఉపసంహరణ నేడే..
ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆత్మకూర్(ఎం), రాజాపేట మండలాల్లో ఈనెల 11న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే పలుచోట్ల ప్రధానపార్టీల అభ్యర్థులకు రెబల్స్ తలనొప్పి ఉంది. కొన్నిచోట్ల బుజ్జగింపులతో ఉపసంహరించుకోగా, మరికొన్ని చోట్ల బెదిరింపులు, బేరసారాలు నడిచాయి. అయితే బుధవారం భారీగానే నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
వలిగొండ మండలంలో నామినేషన్ల స్వీకరణఅర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.
మైనర్, కొత్త గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అంతర్గతంగా వేలం పాటలు పాడారు. గ్రామాభివృద్ధికోసం నిధులు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల రెండు పార్టీలు సర్పంచ్–ఉపసర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను పంచుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవం సర్పంచ్‌లు, వార్డు సభ్యుల లెక్కలు తేలనుంది.
నామినేషన్ల వివరాలు
మండలం జీపీలు చివరి రోజు మొత్తం
భూదాన్‌పోచంపల్లి 21 65 117
భువనగిరి 34 130 202
బీబీనగర్ 34 84 177
రామన్నపేట 24 69 136
మండలం వార్డులు చివరి రోజు మొత్తం
భూదాన్‌పోచంపల్లి 192 340 487
భువనగిరి 294 506 743
బీబీనగర్ 284 386 736
రామన్నపేట 232 421 607
భారీగా నామినేషన్లు


