సెల్లార్లు ఖాళీ చేయించేదెప్పుడు?
భువనగిరి టౌన్ : జిల్లా కేంద్రంలోని వివిధ దుకాణాల ఎదుట పార్కింగ్‌కు స్థలం లేక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు విస్తరించకపోవడంతో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా తయారైంది. ప్రధాన కూడళ్లకు కారులో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ దూరంలో పెద్ద వాహనాలను నిలిపి ప్రధాన షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలకు వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
సెల్లార్ షాపింగులతో ఇబ్బందులు
భువనగిరి మున్సిపాలిటీలో బహుళ అంతస్తుల భవనాల సెల్లార్‌లను కిరాయికి ఇవ్వడంతో పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసం వదిలివేయాలి. కానీ సెల్లార్లలో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వాహనాలు రోడ్ల పక్కన పార్క్ చేయాల్సి వస్తోంది. ప్రధాన రోడ్డులో సెల్లార్లను వ్యాపార నిమిత్తం ఉపయోగిస్తున్నారు. సెల్లార్లను కిరాయిలకు ఇస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సెల్లార్లను ఖాళీ చేయించి, వాటిని పార్కింగ్ స్థలాలుగా ఉపయోగిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది.
ఆదేశాలు బేఖాతర్..
సెల్లార్లలో షాపులను ఖాళీ చేసి వాటిని వాహనాల పార్కింగ్ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని గతంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేసినా వారు పట్టించుకోవడం లేదు. గత నెలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన అధికారులు సెల్లార్ షాపులకు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. నెల రోజులు గడుస్తున్నా ఖాళీ చేయకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ముడుపులు తీసుకుని సెల్లార్ దుకాణాలను ఖాళీ చేయించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెల 31 వరకే ఖాళీ చేయాలని చివరి గడువు విధించినా అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం లెక్కచేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. షాపింగ్ చేసే జనం ఇబ్బందులను గుర్తించి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలంటే సెల్లార్లలో కొనసాగే దుకాణాలను ఖాళీ చేయించి వాటిని పార్కింగ్ స్థలాలుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఫ నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు
ఫ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
ఫ యథేచ్ఛగా కొనసాగుతున్న సెల్లార్ దుకాణాలు


