ఆదర్శ నేత రాఘవరెడ్డి
ఫసర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నాయకుడు
చిట్యాల : రాజకీయాలలో నీతి,నిజాయితీకి మారు పేరుగా నిలిచిన నేత దివంగత నర్రా రాఘవరెడ్డి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేశారు.
వట్టిమర్తి సర్పంచ్‌గా ఏక గ్రీవం
చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 1959లో (నాడు వట్టిమర్తి, శివనేనిగూడెం కలిసి ఉండేవి) జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో నార్కట్‌పల్లి సమితి ప్రెసిడెంట్‌గానూ ఆయన ఎన్నికయ్యారు. 1964 వరకు సర్పంచ్‌గా పని చేశారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా..
1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో ఒకసారి ఓటమి పాలైనప్పటికీ తిరిగి 1977లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత రాఘవరెడ్డికే దక్కింది. 2015 ఏప్రిల్ 15న రాఘవరెడ్డి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా వట్టిమర్తి వద్ద ఎన్‌హెచ్ 65 పక్కన రాఘవరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.


