జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ : విజ యవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం చౌటుప్పల్ పట్టణంలో వాహనాల రద్దీ నెలకొంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సైతం ప్రయాణికులు కిటకిటలాడారు. ఉదయం 11గంటల వరకు విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ ఉండగా, సాయంత్రం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ మార్గంలో రద్దీ ఉంది. దీంతో చౌటుప్పల్ పట్టణంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు సాఫీగా వెళ్లేందుకుగాను ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సు సర్వీసులు లేక చౌటుప్పల్ బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షించారు.
‘కల వస్తే బాగుండును’ పుస్తకావిష్కరణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఆదివారం మట్టి కవి, ప్రొఫెసర్ బెల్లి యాదయ్య సాహిత్య మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెల్లి యాదయ్య రచించిన ‘కల వస్తే బాగుండును’ కవితా సంపుటిని ప్రకృతి కవి జయరాజు ఆవిష్కరించి మాట్లాడారు. బెల్లి యాదయ్య నేటి సమాజం కోసం ఎన్నో మంచి పుస్తకాలు రచించారని కొనియాడారు. అనంతరం బెల్లి యాదయ్య కవిత్వం, సాహిత్య దృక్పథంపై పరిశోధకుడు, హైకోర్టు న్యాయవాది విప్లవ్‌కుమార్ చేసిన పరిశోధనా పుస్తకం అవుట్‌లుక్‌ను సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఆనందం, అనితారాణి, తెలంగాణ వాగ్గేయకారుడు చింతల యాదగిరి, కృష్ణ కౌండిన్య, పగడాల నాగేందర్, కవి మునాస వెంకట్ పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ


