ప్రత్యేక గ్రీవెన్స్, ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్‌తో పాటు సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం తిరిగి యథావిధిగా కొనసాగుతాయన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శన వాయిదా
భువనగిరి: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం భువనగిరి మండలం రాయగిరి పరిధిలోని విద్యాజ్యోతి హైస్కూల్‌లో నేటినుంచి 29వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శన జరగాల్సి ఉంది. సుమారు 200 పాఠశాలలు సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొనేందుకు వివరాలు నమోదు చేసుకున్నాయి. కాగా, ఉపాధ్యాయులకు సర్పంచ్ ఎన్నికల విధులు పడనుండటంతో సైన్స్‌ఫెయిర్‌ను వాయిదా వేసినట్లు డీఈఓ సత్య నారాయణ తెలిపారు. తదుపరి తేదీలను ఎన్నికల అనంతరం ప్రకటిస్తామన్నారు.
విద్యార్థులకు రవాణా భత్యం
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు మంజూరయ్యాయి. 10 నెలలకు సంబంధించి రూ.54.18 లక్షలు విడుదల చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 3 కిలో మీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే విద్యార్థులు ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున చెల్లిస్తోంది. హాజరు శాతం ప్రకారం జిల్లాలో 885 మంది విద్యార్థులను విద్యాశాఖ అర్హులుగా గుర్తించింది. వారందరి ఖాతా త్వరలోనే డబ్బులు జమ కానున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిందే : కలెక్టర్
సాక్షి,యాదాద్రి : రోడ్డు ప్రమాదాలను తగ్గించి విలువైన ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రహదారులపై ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. డీసీపీ అకాంక్ష్‌యాదవ్ మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్లు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, మరమ్మతులు చేయించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, రోడ్లు భవనాల శాఖ జిల్లా అధికారి సరిత పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని
పరిరక్షించుకుందాం
భువనగిరిటౌన్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రత్యేక గ్రీవెన్స్, ప్రజావాణి రద్దు


