రామగిరి(నల్లగొండ): మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసి మోసం చేసిన కేసులో నిందితుడికి 22 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు రెండవ అదనపు జడ్జి రోజారమణి శుక్రవారం తీర్పు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అల్లం మహేష్ 2014 సంవత్సరంలో బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో.. బాధితురాలు తండ్రి వాడపల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ వాదనలతో ఏకీభవించిన జడ్జి రోజారమణి నిందితునికి 22 సంవత్సరాలు జైలు రూ.35000 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం త్వరితగతిన చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశిస్తూ తీర్పులో పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో
ఏడు పాడి గేదెలు మృతి
నడిగూడెం: నడిగూడెం మండలం రామాపురం గ్రామ పరిధిలోని ఊర చెరువులో విద్యుత్ తీగలు తగిలి ఏడు పాడి గేదెలు మృతిచెందాయి. వివరాలు.. రామాపురం గ్రామంలోని పలువురు రైతులకు చెందిన ఏడు పాడి గేదెలు శుక్రవారం మేత మేసేందుకు గ్రామ పరిధిలోని ఊర చెరువు వద్దకు వెళ్లాయి. చెరువులో విద్యుత్ తీగలు తెగిపడడంతో ఆ తీగలకు ఏడు గేదెలు తగలడంతో మృతిచెందాయి. బూతుకూరి రామిరెడ్డికి చెందిన 3, నేలమర్రి శ్రీనుకు చెందిన 2, తొడేటి శ్రీను, బంక శంకర్‌కు చెందిన ఒక్కో గేదె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే గేదెలు మృతిచెందాయని గ్రామస్తులు ఆరోపించారు.