
యాదగిరి క్షేత్రానికి ఆషాఢం ఎఫెక్ట్
ఫ గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఆషాఢ మాసం ప్రారంభంకావడంతో పాటు అటు గ్రామాల్లో వ్యవసాయం పనుల్లో రైతులు బిజిబిజీగా ఉండటం.. ఇటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్తుండటం, జంట నగరాల్లో బోనాల పండుగ ప్రారంభం కావడంతో భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు వెలవెలబోయాయి. స్వామివారి దర్శనానికి 30 నిమిషాల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. శుక్రవారం స్వామివారిని సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.12,15,624 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
కడుపునొప్పి భరించలేక యువకుడి బలవన్మరణం
చిట్యాల: కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో శుక్రవారం జరిగింది. చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలికట్టె గ్రామానికి చెందిన జక్కలి మత్స్యగిరి(22) చిట్యాల మండలంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తమ వ్యవసాయ పొలం వద్ద బర్రెలను కట్టేసి రావటానికి వెళ్లి పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మహేశ్వరీ, ఒక కుమారుడు ఉన్నారు. తన భర్త కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు మత్స్యగిరి భార్య మహేశ్వరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సభకు వెళ్లి
వస్తుండగా ప్రమాదం
ఫ కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
ఫ కట్టంగూరు మండలం పామనగుండ్ల వద్ద ఘటన
ఫ మృతుడు మఠంపల్లి మండలం
చెన్నాయిపాలెం వాసి
హుజూర్‌నగర్: హైదరాబాద్‌లో కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సభకు కారులో వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో పామనగుండ్ల శివారులోకి రాగానే కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. కారును ఢీకొట్టిన లారీ వెళ్లిపోయింది. వెనుక వస్తున్న వారు గమనించి గాయపడిన వారిని పరిశీలించగా అప్పటికే కుర్రి శ్రీను(40) మృతిచెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

యాదగిరి క్షేత్రానికి ఆషాఢం ఎఫెక్ట్