
పురుగుల మందు తాగి..
మోత్కూరు: వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల పరిధిలోని పర్రెపాడు గ్రామానికి చెందిన ఏగూరి స్వరూప కుటుంబం 20ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మోత్కూరు పట్టణానికి వచ్చి స్థానిక కొత్త బస్టాండ్ కాలనీలో నివాసముంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త గతంలోనే మృతిచెందాడు. స్వరూప ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. స్వరూప చిన్న కుమారుడు సుధాకర్(30) జూన్ 27న వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగాడు. అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందారు. మృతుడు గ్రామంలో బ్యాండ్ వాయిస్తూ జీవనం సాగించేవాడు. మృతుడి అన్న హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవనంసాగిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.