
బ్లాక్‌మెయిల్ చేస్తున్నందుకే వివాహిత హత్య
గుర్రంపోడు: తన వద్ద ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. అవి బయటపెట్టి పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతాను అని బ్లాక్‌మెయిల్ చేసినందుకే గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను గురువారం కొండమల్లేపల్లిలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ నవీన్‌కుమార్, గుర్రంపోడు ఎస్‌ఐ మధు విలేకరులకు వెల్లడించారు. గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన మంకెన జ్యోతి భర్త, పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసముంటోంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి గొడితల మహేష్.. గత ఏడేళ్లుగా జూనూతల గ్రామంలో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో ఉంటూ ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. గతేడాది జూనూతల గ్రామానికి చెందిన జ్యోతి బంధువు కడుపునొప్పితో అదే గ్రామంలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న గొడితల మహేష్ వద్దకు వెళ్లింది. ఆర్‌ఎంపీ మహేష్ జ్యోతి బంధువును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. బంధువును చూసేందుకు నల్లగొండ ఆస్పత్రికి వచ్చిన జ్యోతికి, ఆర్‌ఎంపీ మహేష్‌తో సన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ ఫోన్‌లో, వాట్సప్ వీడియో కాల్స్‌లో సన్నిహితంగా మాట్లాడుకునేవారు. మిర్యాలగూడలో ఉంటున్న జ్యోతి తరచూ మహేష్‌కు ఫోన్ చేసి తన వద్దకు రమ్మని సతాయిస్తూ అతడితో గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా తన వద్దకు రాకుంటే వీడియోలు, ఫొటోలు ఉన్నాయని పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానని బెదిరించింది.
పథకం ప్రకారమే..
జ్యోతి ఎప్పటికై నా తనపై కేసు పెట్టి తనకు భవిష్యత్తు లేకుండా చేస్తుందని భావించిన ఆర్‌ఎంపీ మహేష్ ఎలాగైనా ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 29న రాత్రి మిర్యాలగూడ నుంచి మల్లేపల్లికి బస్సులో వచ్చిన జ్యోతిని తన కారులో ఎక్కించుకున్న మహేష్ నల్లగొండ వరకు వెళ్లి తిరిగి జూనూతుల గ్రామానికి వస్తున్నారు. రాత్రి 11గంటల సమయంలో కొప్పోలు గ్రామ సమీపంలో కారును రోడ్డు పక్కకు ఆపి జ్యోతిపై మహేష్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె చేత బీపీ తగ్గి స్పృహ కోల్పోయేలా 8 మాత్రలు మిగించాడు. ఆ తర్వాత జ్యోతి స్పృహ కోల్పోతున్న క్రమంలో పది రోజుల క్రితమే గుర్రంపోడులో కొనుగోలు చేసి కారులో సిద్ధంగా ఉంచుకున్న గడ్డి మందును రెండు ఇంజెక్షన్ల ద్వారా ఆమె రెండు చేతులకు ఎక్కించాడు. అప్పటికీ ఆమె పూర్తిగా స్పృహ కోల్పేలేదని గ్రహించిన మహేష్ ఆమె చేత గడ్డి మందు నీళ్లలో కలిపి బలవంతంగా తాగించాడు. అదే రోజు రాత్రి దేవరకొండ ఆస్పత్రికి తీసుకెళ్లి గడ్డి మందు తాగిందని చెప్పి జ్యోతిని ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుర్రంపోడు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం మల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్, గుర్రంపోడు ఎస్‌ఐ పి. మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణగౌడ్, వీక్షిత్‌రెడ్డి, నాగరాజు, సైదులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జూనూతుల గ్రామ బస్ స్టేజీ వద్ద నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద సిరంజీలు, టాబ్లెట్లు, గడ్డిమందు డబ్బా, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని దేవరకొండ కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నేరస్తుడిని పట్టుకోవడంలో చొరవ చూపిన సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ పసుపులేటి మధు, కానిస్టేబుళ్లను దేవరకొండ ఏఎస్పీ మౌనిక అభినందించారు.
నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు
తరలించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన
కొండమల్లేపల్ల్లి సీఐ నవీన్‌కుమార్