
పాత కమిషనర్ వెళ్లలేదు.. కొత్త కమిషనర్ చేరలేదు..!
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. సీడీఎంఏ కార్యాలయంలో సూపరింటెండెంట్‌లుగా ఉన్న కొందరికి కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తూ సర్కారు పోస్టింగ్‌లు ఇచ్చింది. కమిషనర్లుగా కొనసాగుతున్న వారిని ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేసింది. ఈ మేరకు గత నెల 23వ తేదీన ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ను భూపాలపల్లి(ద్వితీయ శ్రేణి) మున్సిపాలిటీకి బదిలీ చేసింది. శ్రీనివాస్ స్థానంలో ఆలేరు మున్సిపల్ కమిషనర్‌గా సీడీఎంఏ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్‌రాములును నియమించింది. సాధారణంగా బదిలీ ఉత్తర్వులు వెలువడిన వారం, పది రోజుల్లో పాత అధికారులు రిలీవ్ కావడం.. కొత్త వారు బాధ్యతలు స్వీకరణ ప్రక్రియ పూర్తి కావాలి.
కొత్త కమిషనర్‌కు చుక్కెదురు..
భూపాలపల్లి మున్సిపాలిటీకి బదిలీ అయిన కమిషనర్ శ్రీనివాస్ రిలీవ్ కాకపోవడంతో ఈ నెల 26వ తేదీన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వెంకట్‌రాములకు చుక్కెదురైంది. దీంతో ఆయన జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి వీలుకాలేదని తెలిసింది. అయితే ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసి పది రోజులవుతున్నా కొత్త కమిషనర్ వెంకట్‌రాములు బాధ్యతలు స్వీకరించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
కార్యాలయ వర్గాల్లో చర్చ..
ఒక వేళ శ్రీనివాసే కమిషనర్‌గా కొనసాగించాలని ఉన్నతాధికారులు భావిస్తే పది రోజుల క్రితం ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు రద్దు చేసి, రివైజ్డ్ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పడు వెంకట్‌రాములుకు మరో మున్సిపాలిటీకి పోస్టింగ్ ఇచ్చేందుకు ఆస్కారం కలుగుతుంది. కానీ ఇప్పటివరకు రివైజ్డ్ ఆదేశాలు అధికారులు జారీచేయని నేపథ్యంలో ఆలేరు మున్సిపాలిటీకి శ్రీనివాస్, వెంకట్‌రాములు ఇద్దరు కమిషనర్లు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం విధుల్లో ఉన్న కమిషనర్ శ్రీనివాసే ఇక్కడ కొనసాగుతారా లేదా కొత్త కమిషనర్ వెంకట్‌రాములు బాధ్యతలు స్వీకరించనున్నారా అనేది ఇప్పుడు కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆలేరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి
చర్చనీయాంశంగా మారిన
మున్సిపల్ కమిషనర్ల బదిలీ
రాజకీయ జోక్యమే కారణమా?
ప్రభుత్వ ఉత్వర్వులు వెలువడినా రాజకీయ జోక్యం కారణంగానే వెంకట్‌రాములు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి ఐదు నెలలే అయినందున ఆయన బదిలీని పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి కూడా శ్రీనివాస్ బదిలీకి బ్రేక్ పడటానికి మరో కారణమనే తెలుస్తోంది.