
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మిర్యాలగూడ అర్బన్: గుండె నొప్పితో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండలం కొంతనందికొండ గ్రామానికి చెందిన సుంకిశాల ముత్తయ్య(60)కు రెండు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలోని గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేరొక ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ముత్తయ్య మృతికి ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువులు గురువారం ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ మోతీరాం, ఎస్‌ఐ సైదిరెడ్డితో కలిసి ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆస్పత్రి యాజమాన్యం, మృతుడి బంధువులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా.. రోగి మృతి పట్ల తమ నిర్లక్ష్యం ఏమీలేదని, గుండెపోటు తీవ్రం కావడంతోనే మృతిచెందాడని పేర్కొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని మృతుడి బంధువుల ఆరోపణ
ఆస్పత్రి ఎదుట ఆందోళన