
రామన్నపేట.. పోరుబాట!
అసెంబ్లీ సెగ్మెంట్‌ను పునరుద్ధరించాలని అఖిలపక్షం డిమాండ్
ఫ నియోజకవర్గ సాధనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్న నాయకులు
ఫ పాత రామన్నపేట కావాలని తీర్మానం
ఫ ఎన్నికల హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి
నియోజకవర్గ సాధనకు
సమష్టిగా పోరాడుతాం
నియోజకవర్గ సాధనకు సమష్టిగా పోరాడుతాం. అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్య నాయకుల మద్దతు కూడగడతాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తాం.
– రెబ్బస్ రాములు, అఖిలపక్ష నాయకుడు
పూర్వ వైభవం తీసుకురండి
రామన్నపేట నియోజకవర్గం రద్దయినప్పటి నుంచి యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. వ్యాపార లావాదేవీలు కూడా స్తంభించాయి. రామన్నపేటకు పూర్వ వైభవం తీసుకురావాలని రాజకీయ నాయకులు, యువకులు, ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
– తిరుమలేష్, పండ్ల వ్యాపారి, రామన్నపేట
సాక్షి, యాదాద్రి : పాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2008లో జరిగిన పునర్విభజనలో రద్దయిన రామన్నపేట నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకునేందుకు ఈ ప్రాంతవాసులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. నియోజవకర్గ సాధనకు సోమవారం రామన్నపేటలో అఖిలపక్ష కమిటీ సమావేశమై చర్చించింది. గతంలో ఉన్నట్టుగానే రామన్నపేటను అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలని కమిటీ నేతలు తీర్మానించారు. గత పునర్విభజనతో రామన్నపేట నియోజకవర్గం కనుమరుగై ఇందులోని నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కలిసిపోయాయి. దీంతో రామన్నపేట ముఖచిత్రం మారిపోయింది. ఉద్ధండ నేతల రాజకీయ భవితవ్యం తారమారైంది.
మళ్లీ నియోజకవర్గం కావాలి
రామన్నపేట నియోజకవర్గం మళ్లీ ఏర్పాటు కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు రామన్నపేటను నియోజకవర్గంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మరలా నియోజకవర్గం ఏర్పాటు చేస్తే రామన్నపేట మండలంతోపాటు చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, చిట్యాల, వలిగొండ లేదా పోచంపల్లి మండలాలు పరిశీలనలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
పునర్విభజనకు ముందు..
2008 పునర్విభజనకు ముందు రామన్నపేట నియోజకవర్గంగా ఉండేది. వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, ఆత్మకూర్(ఎం), గుండాల మండలాలు, నార్కట్‌పల్లిలోని మూడు గ్రామాలు నకిరేకల్‌లోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గం కింద ఉండేవి. రామన్నపేటలోని మండలాలను పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో కలిపారు. మోత్కూరును తుంగతుర్తిలో, గుండాల, ఆత్మకూర్(ఎం)ను, ఆలేరు, వలిగొండ మండలాలను భువనగిరిలో, రామన్నపేటను నకిరేకల్ నియోజకవర్గాల్లో కలిపారు.
పాత తాలుకా కేంద్రం నుంచి..
రామన్నపేట మొదట తాలుకా కేంద్రంగా ఉంది. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా మారింది. దీంతో ఎప్పటినుంచో ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, సబ్‌కోర్టుతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.
‘ఉప్పునూతల’ మార్క్ రాజకీయం
రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటై 2009లో రద్దయ్యింది. 13 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ, ఏడు సార్లు గెలుపొందింది. పీడీఎఫ్ రెండుసార్లు, సీపీఐ నాలుగు సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గానికి చెందిన ఉప్పునూతల పురుషోత్తమ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా నేతగా మారి చక్రం తిప్పారు. ఈయన 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి, 1973లో జలగం వెంకట్రావు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇదే నియోజకవర్గం నుంచి 1981లో కొమ్ము పాపయ్య గెలుపొంది అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య మంత్రి వర్గంలో పనిచేశారు.
కార్యాలయాలకు భవనాలు సిద్ధంగా ఉన్నాయి
నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు సిద్ధంగా ఉన్నాయి. నైసర్గికంగా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాలకు మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ పెద్దల ద్వారా నియోజకవర్గ ఏర్పాటుకు కృషిచేస్తా. – సిరిగిరి మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, రామన్నపేట

రామన్నపేట.. పోరుబాట!

రామన్నపేట.. పోరుబాట!

రామన్నపేట.. పోరుబాట!