
వర్షంతో పత్తిచేలకు ప్రాణం
సాక్షి,యాదాద్రి : రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షంతో రైతులు సాగుబాట పట్టారు. ఈ వానాకాలం ప్రారంభంలో వర్షాలు సరిగా కురవలేదు. జూన్ నెల మొత్తం కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి 30 వరకు 99.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 57.4 మి.మీ వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్ట, భువనగిరి, అడ్డగూడూరు, బీబీనగర్, మోత్కూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ, ఆలేరు, రాజాపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అడపాదడపా కురిసిన వర్షాలకు అధిక శాతం మంది రైతులు పత్తిసాగు చేశారు. తాగాగా కురుస్తున్న వర్షంతో పత్తి మొలకలకు ప్రాణం పోసినట్టయింది. ఇప్పటికే పత్తిసాగు చేసి మొలకలు రాని రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నష్టమైనా సరే మరోసారి విత్తనాలు నాటుకుంటున్నారు. మొలకలు రాని స్థానంలో కొత్తగా విత్తనాలు విత్తుతున్నారు. మరికొందరు పత్తిచేలల్లో కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇంకొందరు వరినాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి వ్యవసాయ శాఖ జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేసింది. అయితే అకాల వర్షాలతోపాటు రోహిణి కార్తెలోనే సుమారు 70 వేల ఎకరాల్లో పత్తిసాగు జరిగింది. వర్షం రాకపోవడంతో మొలకలు ఎండిపోయాయి. వానాకాలంలో కురవాల్సిన వర్షాలు మొఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ మొలకెత్తని చోట రెండోసారి
విత్తనాలు విత్తుకుంటున్న రైతాంగం
ఫ జూన్‌లో వర్షాల్లేక వెనుకబడిన
సాగు పనులు
జూన్ 30 వరకు వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..)
సీజన్ కురవాల్సింది కురిసింది
2024 99 116 (16 శాతం అధికం)
2025 99 57.4 (42 శాతం లోటు)