
మోసంచేసి పారిపోయిన చిట్టీల వ్యాపారి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: ఎంతో నమ్మకంగా ఉంటూ 46 మందితో చిట్టీలు కట్టించుకుని మోసంచేసి పారిపోయిన చిట్టీల వ్యాపారిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను టూటౌన్ సీఐ సోమనర్సయ్య మంగళవారం విలేకరులకు వెల్లడించారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన కటకం సైదిరెడ్డి గత కొన్నేళ్లుగా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటూ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కాలనీవాసులతో పరిచయం పెంచుకుని చిట్టీలు వేయడం ప్రారంభించాడు. 46మంది కాలనీవాసులు అతడి వద్ద చిట్టీలు వేశారు. మొదట్లో బాగానే చిట్టీ డబ్బులు చెల్లించిన సైదిరెడ్డి కొంతకాలంగా చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేస్తున్నాడు. అంతేకాకుండా అధిక వడ్డీ ఆశ చూపి 42 మంది నుంచి రూ.1.50కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల చిట్టీ పాడినవారు డబ్బుల కోసం సైదులు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖరరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్‌హాల్ వద్ద సైదిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సైదిరెడ్డి పారిపోయేందుకు సహకరించిన శాంతినగర్‌కు చెందిన కటకం వెంకట్‌రెడ్డి, ముత్తిరెడ్డికాలనీకి చెందిన మామిళ్ల వెంకన్న, రామ్‌నగర్‌కు చెందిన గుణగంటి జానయ్యను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. చిట్టీలు కట్టిన బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు బి. రాంబాబు, డి. హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ అతడికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు