
నీటి సంపులో పడి చిన్నారి మృతి
కోదాడరూరల్: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండ గ్రామానికి చెందిన శ్రీపాది గోపి, నాగేశ్వరి దంపతులకు కుమారుడు మహదేవ్(20 నెలలు) ఉన్నాడు. గోపి మంగళవారం మిర్యాలగూడలో కార్పెంటర్ పనికి వెళ్లగా.. నాగేశ్వరి కుమారుడితో కలిసి ఇంటి వద్దే ఉంది. మధ్యాహ్నం సమయంలో నాగేశ్వరి కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రించింది. ఈ క్రమంలో మహదేవ్ నిద్రలేచి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో పడ్డాడు. అరగంట తర్వాత నాగేశ్వరికి మెళుకువ వచ్చి చూడగా పక్కన కుమారుడు లేకపోవడంతో సంపులో చూడగా అందులో మహదేవ్ మృతిచెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రి గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం. అనిల్‌రెడ్డి తెలిపారు.