
నీళ్లొస్తాయా.. బీళ్లుగానే ఉంటాయా..!
సూర్యాపేట: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ ఆయకట్టు రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గత మూడు సీజన్ల నుంచి ఈ ఆయకట్టు పొలాలు ఎండుతూనే ఉన్నాయి. ప్రధాన కాల్వ మినహా ఎక్కడా నీరు పారని పరిస్థితి. ఈ నేపథ్యంలో సూర్యాపేటతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 2.20 లక్షలకు పైగా ఆయకట్టు భూములున్నా.. కనీసం 60 నుంచి 70వేల ఎకరాల్లో కూడా పంటలు పండిన దాఖలు లేవు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఈసారైనా తమ భూములకు నీళ్లు వస్తాయా..? బీడు భూములుగానే ఉంటాయా..? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు.
నాన్ ఆయకట్టు నుంచి..
2018కు ముందు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు పూర్తిగా నాన్ ఆయకట్టు ప్రాంతాలు. కేవలం వర్షాధార పంటలే పండేవి. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాలు కలిపి 2,29,961 ఎకరాలు నాగార్జునసాగర్, 15,230 ఎకరాలు మూసీ ఆయకట్టు కింద ఉండేది. 2018 వానాకాలం నుంచి 2023 వానాకాలం వరకు రెండు పంటలకూ నీళ్లు అందాయి. ఈ సమయంలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో మెట్ట పంటలను సాగు చేసిన రైతులంతా వరి వైపు మళ్లారు. వేలాది రూపాయలు వెచ్చించి మెట్ట భూములను తరి భూములుగా మార్చారు. దీంతో సూర్యాపేట జిల్లాలో ఓ వైపు కృష్ణమ్మ, మరోవైపు మూసీనది, ఇంకోవైపు గోదావరి జలాలు పారడంతో త్రివేణి సంగమ జిల్లాగా మారిపోయి దాదాపు 5,85,464 ఎకరాల ఆయకట్టులో వరి పండింది.
గత మూడు సీజన్ల నుంచి ఇబ్బందులు..
2023 యాసంగి నుంచి సూర్యాపేట జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు వచ్చాయి. వర్షాభావ పరిస్థితులతో ఈ సీజన్‌లో ఆరు తడి పంటలకు మాత్రమే నీటిని వదిలారు. అయినా కొందరు వరినాట్లు, మరికొందరు ఆరుతడి పంటలు వేసి తీవ్రంగా నష్టపోయారు. 2024 –25 వానాకాలంలో చాలా ఆలస్యంగా సెప్టెంబర్ మాసంలో నీటిని విడుదల చేశారు. అప్పటికే పంటల కాలం చివరి దశకు రాగా.. జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములన్నీ పడావు పడి ఉన్నాయి. 2024–25 యాసంగిలో ఎస్సారెస్పీ మొదలుకొని ఎల్‌ఎండీ వరకు సమృద్ధిగా జలాలు ఉన్నప్పటికీ అరకొర నీటినే విడుదల చేశారు. ఈ క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని భూములకు మాత్రమే నీళ్లు అందాయి. ఇక సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో మొయిన్ కాలువ వెంట అందగా, కోదాడ నియోజకవర్గంలోని మోతె, కోదాడ మండలాల వరకు నీళ్లు రానేలేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన క్రమంలో నీటిపారుదల శాఖ యాక్షన్ ప్లాన్‌లో జిల్లాలోని ఎస్సారెస్సీ రెండోదశకు పూర్తిస్ధాయిలో నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఆయకట్టు రైతాంగం కోరుకుంటుంది.
ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు రైతన్నల ఆందోళన
ఫ ఇప్పటికే మూడు సీజన్ల నుంచి
ఎండుతున్న ఆయకట్టు పొలాలు
ఫ 70వేల ఎకరాలకు మించి అందని నీళ్లు
ఫ సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 2.20లక్షల ఎకరాల ఆయకట్టు