
రైతులను మోసం చేసి సంబురాలా..?
రామన్నపేట: రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సంబురాలు చేసుకోవడమేమిటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. గురువారం రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఆయన నీర్నెముల గ్రామంలో మహిళలతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పదకొండు పర్యాయాలు రూ.75వేల కోట్లు రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పంటకు ఎకరాకు రూ.5వేలు మాత్రమే ఇచ్చాడని, రెండో పంటకు పూర్తిగా ఎగ్గొట్టి, మూడో పంటకు నాలుగెకరాల వరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదని విమర్శించారు. రూ.2లక్షల లోపు పంట రుణం ఉన్న రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగలేదని, రూ.2లక్షలకు పైగా రుణం రైతులు డబ్బులను బ్యాంకులకు చెల్లించి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆత్మీయ భరోసాకు కొర్రీలు పెట్టారని, సబ్సిడీ గ్యాస్ ఇవ్వడం లేదని, తులం బంగారం ఊసేలేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. అంతకుముందు ఆయన లక్ష్మాపురంలో ఇటీవల మృతిచెందిన నీల స్వామి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట నాయకులు పోచబోయిన మల్లేశం, బత్తుల శంకరయ్య, కమ్మంపాటి శ్రీనివాస్, సాల్వేరు అశోక్, ఎస్‌కే చాంద్, ఎండీ ఆమేర్, బత్తుల వెంకటేశం, పులిపలుపుల వీరస్వామి, కొయ్యగూరి వెంకన్న, జాడ సంతోష్, బత్తిని మహేష్, ముక్కాముల సత్తయ్య, కుమార్ తదితరులు ఉన్నారు
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య