
బస్సు సౌకర్యం కల్పించాలని ధర్నా
యాదగిరిగుట్ట: మా గ్రామానికి ఏడాదిన్నర నుంచి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామస్తులు బుధవారం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మద్దెల మంజులనాగరాజు మాట్లాడుతూ మా గ్రామం నుంచి వలిగొండ, భువనగిరి ప్రాంతాలకు రావాలంటే బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఐదు రోజుల క్రితం గ్రామానికి బస్సు పంపిస్తామని అధికారులు హామీ ఇస్తే భారీగా స్వాగతం ఫలికేందుకు ఏర్పాట్లు చేశామని, ఇంకా వారం రోజులు పడుతుందని డిపో మేనేజర్ చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో గ్రామ మహిళలు, యువకులు పాల్గొన్నారు.