
ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు న్యాయం చేయాలి
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు తగిన నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం భువనగిరిలో అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాత అలైన్‌మెంట్ ప్రకారంగానే రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగాన్ని నిర్మించాలని కోరారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సంబంధించి రెండు భాగాలకు ఒకే నిబంధన ఉండాల్సి ఉన్నప్పటికీ వేర్వేరుగా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. కొందరు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ను కుదించారన్నారు. భూనిర్వాసితుల సమస్యలపై చౌటుప్పల్, భువనగిరి ఆర్డీఓలకు పలు సార్లు వినతి పత్రాలు సమర్పించినా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలైట్‌మెంట్ మార్చుతామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు చింతల దామోదర్‌రెడ్డి, దబ్బేటి రాములు గౌడ్, గుజ్జుల సురేందర్‌రెడ్డి, అవిశెట్టి పాండుయాదవ్, జాల వెంకటేష్ యాదవ్, బోరెం ప్రకాష్‌రెడ్డి, నర్సిరెడ్డి, బొమ్మిడి ఉపేందర్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్ గౌడ్, గజ్వేల్ జోసెఫ్, జాల జంగయ్య యాదవ్, జాల శ్రీశైలం యాదవ్, జాల నరసింహ యాదవ్, జాల అంజయ్య యాదవ్, గుండెబోయిన వేణు యాదవ్, గజ్వేల్ బాల మల్లయ్య, కార్తీక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.