
వెంచర్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు
చిట్యాల: ఐదేళ్ల క్రితం ప్లాట్లు విక్రయించి అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఆదివారం పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శ్రీనివాస టౌన్‌షిప్(కార్తికేయ వెంచర్) పేరుతో కొందరు రియల్ ఎసే్‌ట్ట్ వ్యాపారులు వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ టౌన్‌షిప్‌లో చిట్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30మంది వరకు ప్లాట్లు కొనుగోలు చేసి వెంచర్ డెవలపర్స్‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందుకుగాను ఒక్కొక్కరు రూ.5లక్షల నుంచి రూ.8లక్షల వరకు టౌన్‌షిప్ నిర్వాహకులకు ఇచ్చారు. అనంతరం వెంచర్ డెవలపర్లు వివిధ కారణాలను చూపుతూ కొనుగోలు చేసిన ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ వెంచర్‌లో ప్లాట్లకు రేట్లు పెరగడంతో ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న వారికి కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆ వెంచర్‌లో ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం తమను మోసం చేసిన వెంచర్ డెవలపర్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బత్తుల జనార్దన్, లింగస్వామి, అయిలయ్య, సత్యనారాయణలతో మరికొందరు ఉన్నారు.
ఫ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారని బాధితుల ఆరోపణ