
వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట): వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు వడ్డెరులకు రాయి, మట్టిపై ప్రభుత్వం తగిన హక్కులు కల్పించాలని వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ‘హలో వడ్డెర–ఛలో సూర్యాపేట’ సభకు ఆయన హాజరై మాట్లాడారు. నిత్యం క్వారీల్లో, మట్టి పనిచేసే వడ్డెర కులస్తులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. గుట్టలపై క్రషర్ మిల్లులను వడ్డెరులకు కేటాయించాలని కోరారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. వయసు పైబడిన వడ్డెర వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర కులస్తులకు అధిక సీట్లు కేటాయించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించని ప్రభుత్వాలను గద్దె దింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓర్సు రాజు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఓర్సు అంజయ్య, కార్యదర్శి రూపని రాజు, పసుల సోమయ్య, కోశాధికారి గోగుల మహేష్, యూత్ అధ్యక్షుడు వరికుప్పల నవీన్, సోషల్ మీడియా ఇన్‌చార్జి శివరాత్రి గోపి, రాష్ట్ర కమిటీ సభ్యుడు పాల్గొన్నారు.
వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ