
నిడమనూరు పీహెచ్‌సీలో అగ్నిప్రమాదం
నిడమనూరు: నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టోర్ రూంలో మంటలు చెలరేగడంతో ఆస్పత్రి కాపలాదారుడు ఉదయ్‌రాజ్ ఊపిరాడక నిద్రలేచి ఆస్పత్రి బయటకు పరిగెత్తాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ జోజి వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సబ్ స్టేషన్ సిబ్బందికి చెప్పి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హాలియా నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. స్టోర్ రూంలో కొన్ని మందులు మండే స్వభావం కల్గి ఉండటంతో ఆస్పత్రిలోని అన్ని గదులకు పొగ వ్యాపించింది. ఫ్రిజ్‌లు, ఆపరేషన్ థియేటర్‌లోని పరికరాలు, ఫర్నీచర్, ఆస్పత్రి బెడ్స్, ల్యాబ్ పరికరాలు, రిజిస్టర్లు, డాక్యుమెంట్లు, దగ్ధమయ్యాయి. రూ.5లక్షలకు పైగా నష్టం జరిగినట్లు పోలీసులు, ఆస్పత్రి వర్గాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆస్పత్రి సీహెచ్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ జోజి తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేస రవి ఆదివారం తెల్లవారుజామున పీహెచ్‌సీని పరిశీలించారు.
నిర్వహణ సరిగ్గా లేక..
నిడమనూరు పీహెచ్‌సీ భవనం 2001లో నిర్మించారు. నీటి లీకేజీతో భవనం స్లాబ్ ధ్వంసమైంది. భవన నిర్వహణ సరిగ్గా లేకనే షార్ట్ సర్క్యూట్ జరగడానికి కారణమని తెలుస్తోంది. నీటి లీకేజీలతో ఎర్త్ వచ్చేదని, కనీస జాగ్రత్తలు పాటిస్తే షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగే ఉండేది కాదని పలువురు అంటున్నారు.
కాలిబూడిదైన రూ.5లక్షలకు పైగా విలువైన మందులు, సామగ్రి