
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : 2025–26 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపికకు ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డీకే వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలని, గత ఐదేళ్ల నుంచి టెన్త్‌లో 95 శాతానికి తగ్గకుండా ఉత్తీర్ణత నమోదై ఉండాలని, అందులో 50 శాతం మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. సొంత బిల్డింగ్ కలిగి ఉండాలని, దరఖాస్తుకు పాఠశాల భవనం ఫొటో జతపర్చాలన్నారు. ఫీజు వివరాలు సమర్పించాలన్నారు.
పైప్‌లైన్ పనులు ప్రారంభం
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిపై ‘పట్టణాల గొంతెండుతోంది’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సీతానగర్‌లో పైపులైన్ పనులను ఆదివారం ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా పైప్‌లైన్ లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. పండుగలు, శుభకార్యాల సమయంలో ట్యాంకర్‌కు రూ.700 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పైపులైన్ వేస్తుడంతో కాలనీవాసులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
నేత్రపర్వంగా తిరువీధి సేవ
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణ వేడుక తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూర మంగళహారతులు సమర్పించారు.
మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్
నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం హైదరాబాద్‌లో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సహకార సంఘాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సహకార సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తాని హామీ ఇచ్చారని తెలిపారు.
ఆత్మస్థైర్యంతో జీవించాలి
భువనగిరి: అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని ఆదివారం భువనగిరిలో జిల్లా వైద్యారోగ్య, హెచ్‌ఐవీ, టీబీ, లెప్రసీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎయిడ్స్‌తో మృతిచెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఎయిడ్స్ వచ్చిన వ్యక్తులు ఆత్మస్థైర్యంతో జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయిశోభ, ఐసీటీసీ సూపర్‌వైజర్ డాక్టర్ వంశీకృష్ణ, ముత్యాలు, నర్సింహ, స్కిడ్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ భానుకుమార్, చంద్రమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు దరఖాస్తుల ఆహ్వానం

బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు దరఖాస్తుల ఆహ్వానం