
సీఎంఆర్‌లో అగ్రస్థానంలో నిలుపుదాం
సాక్షి,యాదాద్రి : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ వేగవంతం చేసి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని, అందుకు అధికారులు, మిల్లర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి(రెవెన్యూ) కోరారు. శనివారం కలెక్టరేట్‌లో ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ అధికారులు, మిల్లర్లతో సమావేశం అయ్యారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ముమ్మరంగా జరుగుతుందని, అదే స్థాయిలో సీఎంఆర్ ఇవ్వాలని మిల్లర్లకు సూచించారు. ఎఫ్‌సీఐ గోదాములలో దిగుమతి సమస్య తలెత్తకుండా సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తగినన్ని గోదాములు కేటాయించడంతో పాటు అవసరం మేరకు రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేస్తే గడువులోపు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేస్తామని మిల్లర్లు తెలిపారు. సమావేశంలో ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ శ్రీ సువిస్‌కుమార్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసంపై సమీక్ష
రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.
ఇంటర్ సప్లిమెంటరీకి పటిష్ట ఏర్పాట్లు
భువనగిరి : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్ష సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని సూచించారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి