
రసాయన ఎరువులతో అనర్థాలు
చింతలపూడి: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు బి.నాగకుమార్ సూచిస్తున్నారు.
చింతలపూడి సబ్‌డివిజన్ పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్‌లో 35,500 ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. 350 ఎకరాల్లో మొక్కజొన్న, 160 ఎకరాల్లో వేరుశెనగ పండిస్తారు. రబీ సీజన్‌లో సుమారు 1,500 హెక్టార్లల్లో వరి, 18,000 హెక్టార్లలో మొక్కజొన్న, 2,500 హెక్టార్లలో వేరుశెనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు.
జిప్సంతో మంచి దిగుబడి
జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ పోషకాలను చౌకగా జిప్సం అందిస్తుంది. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి, గింజ కట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలు ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది. వేరుశెనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సం పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వృద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు ఉండి మంచి ధర పలుకుతాయి. పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా జిప్సం వేసుకోవాలి. బీడు, చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగం వల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి పెరుగుతుంది.
బి.నాగకుమార్, ఏడీఏ, వ్యవసాయ సబ్‌డివిజన్
సేంద్రియ పద్ధతులే మేలంటున్న అధికారులు

రసాయన ఎరువులతో అనర్థాలు

రసాయన ఎరువులతో అనర్థాలు