
సర్దుపోటు!
విద్యుత్ బిల్లుల షాక్
● టీడీపీ కూటమి పాలనలో మినిమం చార్జీలకు కాలం చెల్లు ● ఎఫ్‌పీపీసీఏ చార్జీల పేరిట ఇష్టారాజ్యంగా వడ్డన ● ఒక యూనిట్ వినియోగానికి రూ.737.33 బిల్లు ● భీమవరంలో సర్కారు వీర బాదుడు ● ఒక్కో కనెక్షన్‌పై రూ.400కు పైగా దోపిడీ ● జిల్లావాసులపై దాదాపు రూ.27.97 కోట్ల అదనపు భారం
భీమవరంలోని బుధవారం మార్కెట్ సమీపంలో సుబ్బారావు అనే వ్యక్తికి రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. మరమ్మతుల కోసమని రెండు నెలల నుంచి దానిని ఖాళీగా ఉంచారు. గత నెలకు గాను ఒక పోర్షన్‌లోని మీటరుకు ఒక్క యూనిట్, మరో పోర్షన్‌లోని మీటరుకు మూడు యూనిట్ల రీడింగ్ మాత్రమే వచ్చింది. నిజానికి.. ఈ వినియోగానికి రూ.100 నుంచి రూ.150 లోపు మినిమమ్ చార్జీలతో బిల్లులు రావాల్సి ఉండగా ఒక్క యూనిట్ కు గాను రూ.737.33, మూడు యూనిట్లకు రూ.609.26 చొప్పున బిల్లులు వచ్చాయి. ఎఫ్‌పీపీసీఏ, ఎఫ్‌పీపీసీఏ–2, ఎఫ్‌పీపీసీఏ–3 పేరిట అర్థం కాని లెక్కలతో అదనపు చార్జీలు బాదేశారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో విద్యుత్
కనెక్షన్లు, వినియోగం
విభాగం కనెక్షన్లు వినియోగం
(మి.యూ.)
గృహావసరాలు 6,18,238 77.67
కమర్షియల్ 81,192 17.86
పరిశ్రమలు 2,096 38.45
పంచాయతీ, మున్సిపల్ 14,685 12.96
వ్యవసాయ సంబంధిత 17,753 88.22
పేదలంటే కనికరం లేదు
విద్యుత్ బిల్లు వస్తోందంటేనే భయమేస్తోంది. కరెంటు ఎంత పొదుపుగా వాడుకున్నా సరే బిల్లు మాత్రం తగ్గడం లేదు. పేదలంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఏవో చార్జీలంటూ వినియోగదారులపై భారం మోపుతున్నారు.
– కోరం లలిత, గంగడుపాలెం, యలమంచిలి
సర్దుబాటు చార్జీల పేరుతో..
విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు కూటమి నాయ కులు హామీ ఇచ్చారు. ఇప్పుడు సర్దుబాటు పేరుతో పేదలపై అదనపు భారాన్ని మోపుతున్నారు. పెరిగిన చార్జీలు ఆక్వా రైతులకు భారంగా మారాయి.
– పీవీఆర్‌కే ఆంజనేయరాజు, వాండ్రం, ఉండి
సాక్షి, భీమవరం : మాకే ఓటెయ్యండి తమ్ముళ్లూ.. ‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామే తప్ప.. పెంచే ప్రసక్తే లేదు. నేను గ్యారంటీ’ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. వినియోగదారులకు వరుస షాకులిస్తున్నారు. ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ చార్జీల పేరిట అర్థంకాని లెక్కలతో అదనపు బాదుడు షురూ చేశారు. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం డివిజన్లలో మొత్తం 6.18 లక్షల గృహావసరాల కనెక్షన్లు ఉన్నాయి.
ఎఫ్‌పీపీపీఏ పేరిట బాదుడు
ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కార్డు అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పీపీసీఏ) పేరుతో ప్రస్తుత, పాత సంవత్సరానికి ఫిక్స్‌డ్, కస్టమర్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్‌చార్జీలను సర్దుబాటు పేరిట వినియోగించిన దానికన్నా రెండు మూడురెట్లు బిల్లులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎండలు మండుతున్నా బిల్లులకు భయపడి ఏసీలు కూడా ఆన్ చేయడంలేదని, అయినా రెట్టింపు బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లకు మినిమం రూ.100 నుంచి రూ.150లోపు బిల్లు రావాల్సి ఉండగా రూ.600కు పైబడి బిల్లులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు 6,99,430 ఉండగా ఒక్కో బిల్లుపై సగటున రూ.400 చొప్పున సుమారు రూ.27.97 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా.
సోషల్ మీడియాలో సైటెర్లు
విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోవడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు టీడీపీ కూటమి ప్రభుత్వంపై సైటెర్లు వేస్తున్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమంటూ కూటమి పార్టీల అధినాయకులు ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వంలో తక్కువగా ఉన్న విద్యుత్ బిల్లులు, నేడు పెరిగిన బిల్లులను చూపిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీటికి అధిక సంఖ్యలో లైకులు, షేర్లు వస్తున్నాయి.

సర్దుపోటు!

సర్దుపోటు!

సర్దుపోటు!

సర్దుపోటు!