
పాస్టర్ ప్రవీణ్ పగడాలపై అసత్య ప్రచారం
తణుకులో క్రైస్తవ సంఘాల శాంతి ర్యాలీ
తణుకు అర్బన్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తణుకులో శాంతి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు మీదుగా నరేంద్ర సెంటర్‌కు చేరుకుని ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించారు. క్రిస్టియన్ కౌన్సిల్ నాయకుడు ఒ.మనోజ్‌బాబ్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతికి క్రైస్తవ లోకం బాధపడుతుంటే మద్యం కొనుగోలు చేశారని, మద్యం సేవించి ప్రయాణించారని సామాజిక మాధ్యమాల్లో చూపిస్తూ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా టీవీ 5 మూర్తి క్రైస్తవ లోకాన్ని హేళన చేసేలా దశమ భాగాలు తీసుకునే పాస్టర్లు, పనిమనుషుల నుంచి డబ్బులు తీసుకునే పాస్టర్లు అని సంబోధిస్తూ వ్యంగంగా మాట్లాడడాన్ని క్రైస్తవ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్‌లో డ్రగ్స్ దొరికినప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండానే నిందలు వేశారని, తిరుపతి లడ్డూలో పశువుల కొవ్వు ఉందని ఎటువంటి ఆధారాలు లేకుండానే నిందలు వేసి సున్నితమైన అంశాలను వివాదాస్పదం చేస్తుంది ఎవరని నిలదీశారు. తక్షణమే ప్రవీణ్ మృతి ఘటనను సీఐడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాస్టర్లు ఎం.హారత్‌బాబు, పీడీ ప్రసన్నకుమార్, ఎన్.ఇజ్రాయేలు, కె.దానియేలు, యు.రాజ్‌కుమార్, బి.జేమ్స్, కె.బ్లెస్సింగ్ రాజు, భారీ సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.