బుజ్జగించి.. తప్పించి | - | Sakshi
Sakshi News home page

బుజ్జగించి.. తప్పించి

Dec 3 2025 7:17 AM | Updated on Dec 3 2025 7:17 AM

బుజ్జగించి.. తప్పించి

బుజ్జగించి.. తప్పించి

నేటితో ముగియనున్న తొలివిడత ఉపసంహరణ

సాక్షి, వరంగల్‌: పంచాయతీ పోరులో బుజ్జగింపుల పర్వం ఊపందుకుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి చాలాచోట్ల ఒక్కరికి మించి ఐదుగురు వరకు అభ్యర్థులు బరిలో ఉండడంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలను ముఖ్యనేతలు చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులతో పాటు ఎమ్మెల్యేలు సైతం మేజర్‌ గ్రామ పంచాయతీల్లోనూ హస్తం హవా కొనసాగించాలన్న ఉద్దేశంతో బరిలో నుంచి తప్పుకునేవారికి భవిష్యత్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశముంటుందని నచ్చజెప్పుతున్నారు. పల్లెల్లో అభివృద్ధి పనులు సైతం మీకు వచ్చేలా చూస్తామంటూ ఆర్థిక భరోసాను ఇస్తూ పోటీ నుంచి తప్పించేలా చూస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలో కొన్నిచోట్ల మాత్రమే ఒక్కరికి మించి అభ్యర్థులు ఉండడంతో ఆయా పార్టీ ముఖ్యనేతలు ఒక్కరే బరిలో ఉండేలా మంతనాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థుల కొట్లాట, రెబల్స్‌ పోటీ తమకు కలిసొస్తుందని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఎక్కువ మంది బరిలో ఉంటే తమకు కలిసివస్తుందని బీజేపీ లెక్కలేస్తోంది. ఇలా పల్లెల్లో పార్టీల ముఖ్యనేతలు తిరుగుతూ సర్పంచ్‌ రెబల్స్‌ అభ్యర్థులను బుజ్జగిస్తుండడంతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్ర మే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో బుజ్జగింపుల పర్వం తుదిదశకు చేరుకుంది. అయితే నవంబర్‌ 30 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న రెండో విడత ఎన్నికలకు సంబంధించి దుగ్గొండి, నల్లబెల్లి, గీసుగొండ, సంగెం మండలాల్లో నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. బుధవారం స్క్రూటిని చేశాక ఇక్కడ కూడా బుజ్జగింపుల పర్వం మొదలుకానుంది. ఉపసంహరణకు చివరిరోజు (6వ తేదీ) వరకు కొనసాగనుంది. నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలై శుక్రవారం ముగియనుంది. ఆ తర్వాత తొమ్మిది వరకు ఉపసంహరణ ఉండనుంది.

పోటీ తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు..

జిల్లాలో తొలివిడతలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో 91 పంచాయతీలు, 800 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ నామినేషన్ల దాఖలు ప్రక్రియ నవంబర్‌ 28 తో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళ, బుధవారాల్లో అవకాశం ఉండడంతో కొందరు ఉపసంహరించుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటి (బుధవారం) మధ్యాహ్నం 3గంటలతో ముగియనుండడంతో అన్ని పంచాయతీల్లో బరి లో ఎందరు ఉంటారనేది స్పష్టతరానుంది. ఈ నేపథ్యంలోనే ఒకే పార్టీ మద్దతుతో నామినేషన్లు వేసినవారిలో చాలా మంది ఒకరినొకరు బతిమాలుకుంటున్నారు. స్వతంత్రులుగా పోటీలో ఉండాలనుకుంటున్న వారిని తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎక్కువ ఓట్లు న్న వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉండేలా చూ స్తున్నారు. ప్రత్యేకంగా బుజ్జగింపుల కోసం కొందరు నేతలకు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు బాధ్యతలు అప్పగించారు. కొన్నిచోట్లా ఎమ్మెల్యేలే కలుగజేసుకొని శాంతింపచేస్తున్నారు. మరికొన్ని చోట్లా బరిలో ఉన్న వారి బంధువులతోనే ఫోన్లు చేయిస్తున్నారు. స్నేహితులతోని మాట్లాడి బరి నుంచి తప్పుకుంటే ఎంతో కొంత సర్దుబాటు చేస్తామంటున్నారు. వారి పలుకుబడిని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షలు ఇస్తూ పోటీ నుంచి విరమింపచేస్తున్నారు.

వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో జోరుగా నేతల మంతనాలు

పలుచోట్ల అధికార పార్టీ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరికిపైగా అభ్యర్థులు

పల్లెల్లో అభ్యర్థుల ప్రచారంతో వేడెక్కిన రాజకీయం

వర్ధన్నపేట మండలం ఇల్లెంద పంచాయతీ (బీసీ జనరల్‌) నుంచి నలుగురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సుంకారి సాంబయ్య, బేతి సాంబయ్య, పెంచాల కుమారస్వామి, మడ్డి రాజుకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, డీకొండ ఉపేందర్‌ బరిలో ఉన్నారు. ఆయా పార్టీల ముఖ్యనేతలు ఒక్కరే బరిలో ఉండి మిగతావారు తప్పుకునేలా బుజ్జగింపులు చేస్తున్నారు.

పర్వతగిరి మేజర్‌ గ్రామ పంచాయతీ (ఎస్సీ రిజర్వ్‌డ్‌)లో కాంగ్రెస్‌ పార్టీ నుంచే ఆశావహులు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికే బొట్ల కనకరాజు, బొట్ల మహేంద్ర, బొట్ల వీరస్వామి, సింగారపు రమేష్‌, కందికట్ల అనిల్‌, జిల్లా శ్రీనివాస్‌ నామినేషన్లు వేశారు. వీరిలో ఇప్పటికే స్థానిక నేతలు చేసిన ప్రయత్నాలతో శ్రీనివాస్‌ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. బరిలో ఉన్న మిగతా ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురిని తప్పించేందుకు ఇప్పటికే ముఖ్యనేతలు బుజ్జగింపులు మొదలెట్టారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాడ్గుల రాజు, పొట్ల కిష్టయ్య, చిదురు తిరుపతి, బరిగెల విజయ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో విజయ ఇప్పటికే ఉపసంహరించుకోగా, బరిలో ఉన్న ముగ్గురిలో ఇద్దరిని తప్పించేందుకు బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారు.

రాయపర్తి మేజర్‌ గ్రామ పంచాయతీ (జనరల్‌ మహిళ) ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కుంట వినోద ప్రభాకర్‌, కాంచనపల్లి వనజరాణి, గ్యార భిక్షపతి, కుంట సరిత రమేష్‌ నామినేషన్లు వేశారు. వీరిలో ఒక అభ్యర్థిని మాత్రమే బరిలో ఉంచి మిగిలిన వారిని ఉపసంహరించేందుకు ముఖ్యనేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి చందుమల్లేష్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. ఇక్కడా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో ఉంటే తమకు కలిసొస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ లెక్కలేసుకుంటోంది.

మచ్చుకు కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement