
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
గీసుకొండ: పరకాల నియోజకవర్గంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీఓ అనుబంధ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాధ్యులు కోరారు. ఈ మేరకు గురువారం వారు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు రెండు యాప్‌లను ఇచ్చి సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిందని, గ్రామాల్లో సరిగా ఇంటర్నెట్ లేకపోవడంతో తమ సమయం వివరాల నమోదుకే సరిపోతోందని పేర్కొన్నారు. ఫొటో క్యాప్చర్‌ను తీసివేయాలని, ఐసీడీఎస్‌కు సంబంధించిన బాధ్యతలు మినహా ఇతర పనులు అప్పగించవద్దని కోరారు. వర్ధన్నపేట, ధర్మారం సెక్టార్లలో పనిచేస్తున్న 21 సెంటర్లతో దూర భారం పెరుగుతోందని వివరించారు. ఽవాటిలో కొన్నింటిని వరంగల్ ప్రాజెక్టులో కలపాలని పేర్కొన్నారు. మొగిలిచర్ల, పోతరాజుపల్లి, బొడ్డుచింతలపల్లి సెంటర్లలో తలుపులు శిథిలమయ్యాయని, దొంగలు సామాన్లను ఎత్తుకెళ్తున్నారని తెలిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మేక అనితాకుమారి, ప్రతినిధులు ఎం.స్వరూపారాణి, కె.లలిత, ఎం.కోమలత, జె.రేణుక, పి.జ్యోతి, కళ, ఇందిర, ప్రమీల, ఎమేలియా ఎమ్మెల్యేను కలిశారు.