
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
నర్సంపేట రూరల్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం నుంచి కోనాపురం ప్రధాన రహదారి గురిజాల వద్ద రూ.3.20 కోట్లతో వంతెన నిర్మాణ పనులు, గురిజాల నుంచి కోనాపురం వరకు రూ.3.10 కోట్లతో బీటీ రోడ్డు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి చింతగడ్డతండాకు రూ.60 లక్షలతో బీటీ రోడ్డు, ఇటుకాలపల్లి 365 జాతీయ రహదారి నుంచి మేడపల్లి వరకు రూ.6 కోట్లతో బీటీ నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తొలుత బీటీ రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి