
విచారణ పేరుతో ఈటీసీ ప్రిన్సిపాల్ హల్‌చల్
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో విచారణ కోసం వచ్చానంటూ హసన్‌పర్తి ఈటీసీ(ఎక్స్‌టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్) ప్రిన్సిపాల్ విజయనాయక్ బుధవారం హల్‌చల్ చేసింది. కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకున్నా ఆమె స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడం వివాదాస్పదంగా మారింది. ఏ హోదాతో విచారణ చేపట్టడానికి వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో అప్పటి సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పథకం కింద గ్రామానికి రూ.10 కోట్లు మంజూరు చేశారు. కాగా, ఈ విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని సదరు ప్రిన్సిపాల్.. ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళికి నోటీసు ఇచ్చారు. ఆ నిధులతో తనకు సంబంధం లేదని చెప్పినా పట్టించుకోకుండా ఆమె మెమోలు జారీ చేసి విచారణకు వచ్చింది. దీంతో పాటు గ్రామస్తులను కూడా విచారణకు రావాలని కోరింది. గ్రామస్తులు ఆమె తీరును నిరసిస్తూ రాజమౌళికి ఎలా నోటీసులు ఇచ్చారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అతడిపై ఎవరు ఫిర్యాదు చేశారని, ఎవరి ఆదేశానుసారం వచ్చారని ప్రశ్నించి నిలదీశారు. తనకు గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు నోటి మాటతో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టామని ప్రిన్సిపాల్ చెప్పడంతో గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.
గ్రామంలోని శిక్షణ కేంద్రం నిర్వహణలో రాజమౌళి సక్రమంగా పనిచేయడం లేదని పలుమార్లు నోటీసులు ఇచ్చామని, ఆయన వివరణ సరిగా లేకపోవడంతో విచారణకు వచ్చామని ఆమె పేర్కొన్నారు. శిక్షణ కేంద్రానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై విలేకరులు ఆమెను వివరణ కోరగా సరిగా స్పందించలేదు.
నిరసన తెలిపిన గంగదేవిపల్లి గ్రామస్తులు
ఏ అధికారంతో వచ్చారని నిలదీత

విచారణ పేరుతో ఈటీసీ ప్రిన్సిపాల్ హల్‌చల్