
శానిటేషన్ సవాల్!
పరకాల: పారిశుద్ధ్య కార్మికులు.. స్వచ్ఛ వాహనాల కొరతతో పరకాల మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పనులు ఓ సవాలుగా మారాయి. మరోవైపు నిధుల కొరతతో కొత్త డ్రెయినేజీల నిర్మాణం లేక.. రోడ్లపై మురుగునీరు పారుతోంది. 30 ఏళ్లక్రితం నిర్మించిన అస్తవ్యస్థ డ్రెయినేజీల్లోంచి మురుగునీరు పారట్లేదు. నీరు నిలుస్తున్న కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు.. 150కిపైగా కాలనీలు.. 40 వేలకు పైగా జనాభా ఉంది. ఒకే ఒక్క శానిటేషన్ అధికారితో నలుగురు జవాన్లు కేవలం 64 మంది పారిశుద్ధ్య కార్మికులతో శానిటేషన్ పనులు చేపడుతుంటే పాలకులకు ప్రజల ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ ఉందో స్పష్టమవుతోంది. 64 మందిలో సగం మంది కార్మికులు అంటే.. 32 మందికి పైగా.. పట్టణంలోని ప్రధాన రహదారులు.. కూడళ్లలో పారిశుద్ధ్య పనులు చేస్తుండగా.. మిగతా 32 మందిని షిఫ్టుల వారీగా (22 వార్డుల పరిధిలోని ఒక వార్డుకు.. ఇద్దరు కూడా లేని పరిస్థితి) కాలనీల్లో పనులు చేపడుతున్నారు.
చెత్తాచెదారం..
పరకాల మున్సిపాలిటీలో గల్లీలన్నీ డంప్ యార్డులను తలపిస్తున్నాయి. చెత్తను తీసుకెళ్లాల్సిన స్వచ్ఛ వాహనాలు వారానికోసారైనా రావట్లేదు. చెత్తాచెదా రాన్ని కాలనీ ప్రజలు ప్రధాన కూడళ్లలో పారబోస్తున్నారు. ఆ చెత్తను కూడా ట్రాక్టర్లలో తరలించకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చెత్తంతా మళ్లీ కాల్వల్లోనే కలిసిపోతోంది.
వృద్ధాప్యం పేరిట కార్మికుల తొలగింపు
నెల రోజుల క్రితం పరకాల మున్సిపల్ అధికారులు 15 మంది కార్మికులను వృద్ధాప్యంలో ఉన్నారని తొలగించారు.. అసలే పారిశుద్ద్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండగా వృద్ధాప్యం, వేతనాలు అందించలేని దుస్థితిలో ఉన్నామంటూ 79 మంది కార్మికుల్లో 15 మందిని తొలగించి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి, లేదా కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా నియామకం చేసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది.
వాహనాలు నిరుపయోగం
మున్సిపాలిటీకి 15 వాహనాలుండగా.. 10 వాహనాలు (7 స్వచ్ఛ వాహనాలు, 3 ట్రాక్టర్లు) ఉప యోగంలో ఉన్నాయి. ప్రధాన రహదారుల్ని శుభ్రం చేయడానికి రెండేళ్ల క్రితం రూ.87 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన సొంత వాహనం ఏడాదికే నిరుపయోగంగా మారింది. ఆయా వాహనాల మరమ్మతులకు లక్షలు అవసరమవడంతో తమ వల్ల కాదంటూ అధికారులు చేతులెత్తేశారు.
నిధుల్లేక 30 ఏళ్ల కాల్వలే గత్యంతరం
నిధులు లేకపోవడంతో పరకాల మున్సిపల్ గత పాలకవర్గం డ్రెయినేజీల నిర్మాణానికి తీర్మాణాలు ప్రయోజనం లేకుండా పోయాయి. దీంతో 30 ఏళ్ల క్రితం చేసిన డ్రెయినేజీలే పట్టణ ప్రజలకు గత్యంతరంగా మారాయి.
పరకాలలో అపరిశుభ్రంగా కాలనీలు
నిధులు లేక.. 30 ఏళ్ల నాటి
డ్రెయినేజీలే గతి
64 మంది కార్మికులు..
150 కాలనీలకు పారిశుద్ధ్య పనులు
15 వాహనాలు..
ఉపయోగంలో ఉన్నవి పది మాత్రమే
ఈఫొటోలో ఉన్న మహిళ పేరు జయ. ఈమెది హరితనగర్. ఇప్పటికే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. తమ ఇంటికి సమీపంలో స్థానికులు చెత్త వేస్తున్నారని ఆమె ఆందోళన చెందుతోంది. కోళ్లు, మేకల వ్యర్థాలతో పాటు ఒక్కో సమయంలో చనిపోయిన కుక్కలు, పందుల్ని సైతం తీసుకొచ్చి వేస్తుంటే దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు వరలక్ష్మి, ఈమెది గౌడ వాడ. చెత్త తీసుకెళ్లే స్వచ్ఛ వాహనం వచ్చినట్లు తెలియగానే చెత్త తీసుకొని బయటకు వస్తుంది. కానీ.. అప్పటికే బండి వెళ్లిపోతుంది. ఏం చేయాలో తోచని ఆమె.. చివరికి చెత్తను రోడ్డుపైనే వేస్తోంది.

శానిటేషన్ సవాల్!

శానిటేషన్ సవాల్!

శానిటేషన్ సవాల్!

శానిటేషన్ సవాల్!

శానిటేషన్ సవాల్!