సైబర్ భద్రత.. అందరి బాధ్యత
వనపర్తి: ప్రభుత్వం, పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని.. అందరం సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ సునీతరెడ్డి కోరారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పాలిటెక్నిక్, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ సైబర్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. యువత, విద్యార్థుల్లో డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించేందుకు 6 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత తమ చేతుల్లోనే ఉందని.. అవగాహనే ఆయుధమన్నారు. సైబర్ నేరాలు, వ్యూహాలు, వాటి నివారణ చర్యలు, బ్లాక్ మెయిలింగ్, డీప్‌ఫేక్‌లు, నకిలీ యాప్‌లు, చిన్నారుల సైబర్ రక్షణ వంటి అంశాల గురించి వివరించారు. సైబర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వారానికి ఒక కార్యక్రమం నిర్వహించాలని, టీజీసీఎస్‌బీ అందించే పోస్టర్లు, ఆడియో/వీడియో క్లిప్పింగ్స్ రద్దీ ప్రదేశాల్లో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. 6 వారాల పాటు పోలీసుశాఖ పాఠశాలలు, కళాశాలలు, రవాణా కేంద్రాలు, ప్రజాస్థలాల్లో సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, సైబర్‌క్రైం ఎస్‌ఐ రవిప్రకాష్, సైబర్‌క్రైం సిబ్బంది పాల్గొన్నారు.


