
50 వేల మె.ట. ధాన్యం ఎక్కడా?
వనపర్తి: ‘జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1.76 లక్షల మెట్రిక్ టన్నుల (మె.ట.) ధాన్యం కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.. 95 వేల మె.ట. ధాన్యం అందినట్లు మిల్లర్ల నుంచి రసీదులు వచ్చాయి.. కొనుగోలు కేంద్రాల్లో 18 వేల మె.ట. ధాన్యం నిల్వ ఉన్నట్లు చూపించారు.. మిగతా 50 వేల మె.ట.కుపైగా ధాన్యం ఎక్కడ ఉంది..? మీరు కాగితంపై ఏం రాసిచ్చినా గుర్తించలేమనుకుంటున్నారా..’ అంటూ అధికారుల తీరుపై రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం పట్టణంలోని కల్యాణసాయి గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధ్యక్షతన వరి ధాన్యం కొనుగోలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం తరలింపునకు సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుందని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం ఏడుగురు కాంట్రాక్టర్లు 350 లారీలను కలెక్టరేట్ వద్దకు తీసుకొచ్చి అధికారులకు చూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 179 రైస్‌మిల్లులు ఉండగా.. ఈ సీజన్‌లో పాత బకాయిలు లేని 74 మిల్లులకే మాత్రమే ధాన్యం కేటాయింపులు చేశామని.. సమావేశానికి 18 మంది మిల్లర్లు హాజరుకావడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.
మిల్లర్ల తీరు సరికాదు..
కొందరు మిల్లర్లు కావాలనే తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 1.76 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని.. ఇందుకుగాను రైతుల ఖాతాల్లో రూ.274 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై..
మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా 1,208 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇప్పటి వరకు 116 ఇళ్లు బేస్‌మెంట్ వరకు పూర్తికాగా డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. రెండోవిడతలో నియోజకవర్గానికి 3,500 ప్రకారం.. జిల్లాలో 5,825 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్దేశించుకొని దరఖాస్తుల పరిశీలన చేస్తున్నామని చెప్పారు. అనంతరం రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లు, ఎంపీడీఓలు, పుర కమిషనర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మార్కెట్ యార్డు చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్, ప్రమోదిని పాల్గొన్నారు.