
సేంద్రియ ఎరువులను వినియోగించాలి
గోపాల్‌పేట: పర్యావరణ పరిరక్షణతో రైతులకు మేలు చేకూరుతుందని.. వీలైనంత వరకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారం పెంచే సేంద్రియ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్త డా. రాంరెడ్డి సూచించారు. శనివారం మండలంలోని చెన్నూరులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయశాఖ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై నీరు, పంటలు, చెట్లను సంరక్షించుకునే విధానాలను వివరించారు. రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు తీసుకున్న మందుల వివరాలు, రసీదులను భద్రంగా దాచుకోవాలని, దీంతో కల్తీమందులను నివారించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుందని వివరించారు. భూసార పరీక్షలు చేయించుకొని అనువైన పంటలనే సాగు చేయాలన్నారు. అనంతరం పశు వైద్యాధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి శివతేజ ఆయా శాఖల్లో రైతులకు అందించే రాయితీలను వివరించారు. కార్యక్రమంలో డా. విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, గ్రామ రైతులు పాల్గొన్నారు.