
ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలి
వనపర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని ఠాణాల కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ అప్పగించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలన్నారు. అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని.. నీతి, నిజాయితీతో పనిచేసే వారికి ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. ఫిర్యాదుదారులు చాలా సమయం వేచి ఉండకుండా వారి బాధలు తెలుసుకొని సెల్‌నంబర్ కూడా తీసుకొని తక్షణమే పంపించాలని సూచించారు. ఫిర్యాదుదారుతో మర్యాదగా మాట్లాడటంతో చిన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అసాంఘిక, చట్టవ్యతిరేక పనులు చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించాలని, రాత్రిపూట ఎక్కువ సమయం పెట్రోలింగ్ నిర్వహిస్తే దొంగతనాలను అరికట్టవచ్చన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వాహన తనిఖీలు చేపడుతూ మైనర్లు వాహనాలు నడిపితే పట్టుకొని ప్రతి సోమవారం తల్లిదండ్రులు, వాహన యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి, ఎస్పీ భేటీ..
ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు బుధవారం సమావేశమయ్యారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఆస్పత్రులపై దాడులు, వైద్యసేవలకు అంతరాయంపై నమోదైన కేసులు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజారోగ్యంపై ప్రభావం, ఆహార భద్రత, పోలీసుల సహకారం తదితర అంశాలపై మాట్లాడారు. సమావేశంలో అస్పత్రి సూపరింటెండెంట్ రంగారావు, ఇతర సిబ్బంది ఉన్నారు.