
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
ఆత్మకూర్: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని, ధాన్యం తరలింపునకు లారీల సమస్య లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం మండలంలోని ఆరేపల్లిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం, పట్టణంలోని రైస్‌మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలరోజులుగా దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయకుండా సన్నాలను మాత్రమే సేకరిస్తున్నారని రైతులు ఆయనకు వివరించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నామని, ధాన్యం తరలింపునకు లారీలు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు రోజుకు నాలుగు లారీలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ధాన్యం తరలింపులో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తాలు, చెత్త లేకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తూకం వేయాలని, వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ చాంద్‌పాషా, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, రైతులు ఉన్నారు.