
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
వీపనగండ్ల: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు సిబ్బందికి సహకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కల్వరాల, వీపనగండ్ల, తూంకుంట గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు తరలించే ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యాన్ని సమకూర్చాల్సి ఉంటుందని తాలు, మట్టి పెల్లలు ఉండటం వల్ల రైస్ మిల్లు యజమానులు కూడా నష్టపోయే పరిస్థితులు నెలకొంటాయని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రైతులు నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.
కొర్రీలు పెట్టొద్దు..
చిన్నంబావి: ధాన్యం కొనుగోలులో రైస్‌మిల్లర్ల యజమానుల పేరుతో ఐకేపీ సెంటర్‌లో ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతున్నారని మండలంలోని వెలగొండ గ్రామంలో రైతులు పబ్బేరు ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ధాన్యంలో దుమ్ము ఉందని తరుగు పేరుతో బస్తాకు 4, 5 కిలోలు తీస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ధర్నాకు మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, సీపీఎం జిల్లా నాయకులు ఆంజనేయులు మద్దతు ఇచ్చారు. దాదాపు అరగంటకుపైగా సాగిన ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ జగన్మోహన్ అక్కడికి చేరుకొని అదనపు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడించడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించి రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, తరుగు పేరుతో అధిక మొత్తంలో ధాన్యం తీస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.