
పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
వనపర్తి: ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లు, ఇతరత్రా టూర్లకు వెళ్తుంటారని, ఇదే అదునుగా చోరీలు పెరిగే ఆస్కారం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ రావుల గిరిధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసి ఆవరణలో ఉన్న వాహనాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పటిష్ట గస్తీ నిర్వహిస్తూ అరికట్టాలను సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ తప్పకుండా నవీకరిస్తూ ఉండాలని, ఎలాంటి పెండెన్సీ లేకుండా రికార్డుల నిర్వహణ చేపట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్లో రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి బాధితుల పట్ల వ్యవహరించే తీరు, ఫిర్యాదులు పరిష్కరించే విధానాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మమేకమై సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, ఎలాంటి రిమార్కులు లేకుండా, ప్రజలలో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలా విధులను నిర్వర్తించాలని చెప్పారు. డయల్ 100, బ్లూ కోర్టు సిబ్బంది గ్రామ గ్రామాన సందర్శిస్తూ సమాచార సేకరణలో ముందుండాలన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.