
సాగునీటి రంగం పటిష్టతకు కృషి
వనపర్తి: నియోజకవర్గంలోని గొల్లపల్లి, బుద్ధారం రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాములు, కాల్వల మరమ్మతుకు రూ.1,323 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని నీటిపారుదలశాఖ సీఈ కార్యాలయంలో ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. గొల్లపల్లి రిజర్వాయర్, బుద్ధారం ఆన్‌లైన్ రిజర్వాయర్, కేఎల్‌ఐ, డి–5, డి–8 కాల్వల పటిష్టత, విస్తరణ, స్ట్రక్చర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, బుద్ధారం కుడి, ఎడమ కాల్వల పటిష్టత, గణపురం బ్రాంచ్ కెనాల్, కర్నె తండా, ఖాసీంనగర్ ఎత్తిపోతలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలోనే చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల నిర్మాణాలు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు కేశవరావు, జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.