
భూ భారతితో సమస్యల పరిష్కారానికి కృషి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని గోపాల్‌పేటను పైలెట్ మండలంగా గుర్తించామని, ఇక్కడి 9 గ్రామ పంచాయతీల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ద్వారా నిర్ణీత నమూనాలో దరఖాస్తులు గ్రామంలో ముందుగానే పంచుతామని, వాటిని సరిగా పూరించేందుకు ఇద్దరు ఉద్యోగులను సైతం నియమిస్తామని చెప్పారు. గ్రామానికి సంబంధించిన అన్ని భూ రికార్డులు, మ్యాప్‌లు వెంట తీసుకువెళ్లాలని, అప్పటికప్పుడు పరిష్కరించదగినవి అక్కడే పూర్తిచేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.
● మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల స్క్రూట్నీ అనంతరం జాబితా విడుదల చేయాలన్నారు. జాబితాను ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో లబ్ధిదారులకు ఇల్లు మంజూరు కాపీ అందిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రెండో విడతలో భాగంగా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా లక్ష్యం మేరకు ప్రత్యేకాధికారులు స్క్రూట్నీ చేసిన జాబితాను కలెక్టర్ లాగిన్‌కు పంపించాలని ఆదేశించారు.
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన లే అవుట్లను దస్తావేజులు, గూగుల్ ఎర్త్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న వాటిని ఆమోదించాలని కలెక్టర్ చెప్పారు. ఇరిగేషన్ కెనాల్, ముంపు, నాలా సమస్యలు లేకుండా నిబంధనల ప్రకారం రోడ్లు, ఖాళీ స్థలం, పార్కింగ్ ఉన్న లే అవుట్లను మాత్రమే కమిటీ ద్వారా ఆమోదించడం జరుగుతుందన్నారు. రోడ్లు, 10 శాతం ఖాళీ స్థలం ప్రభుత్వం పేరిట రిజిష్టర్ చేయాలని, అలాగే రోడ్లు, డ్రెయిన్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. కాగా.. శుక్రవారం కమిటీ ముందు మొత్తం 6 లే అవుట్లు పరిశీలనకు రాగా ఇందులో నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉన్న నాలుగింటిని ఆమోదించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్ పీడీ పర్వతాలు, డీఈ విటోబ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.