
మామిడిమాడలో ‘డబుల్’ ఇళ్ల పరిశీలన
ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడలో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను శుక్రవారం పీఆర్‌డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏఈ రమేష్‌నాయుడు, తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ పరిశీలించారు. గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసులు చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణానికి ఫిల్టర్ ఇసుక వాడుతున్నారని కొందరు గ్రామస్తులు వెల్లడించిన విషయం శుక్రవారం పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. అక్కడ ఫిల్టర్ ఇసుక మాత్రమే ఉండటంతో దీనినే ఇంటి నిర్మాణానికి ఉపయోగించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా డీఈ, తహసీల్దార్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి పరిశీలించామన్నారు. అయితే ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన వారు అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో మాట్లాడామని, శనివారం మళ్లీ వచ్చి బాధితులతో వివరాలు తెలుసుకుంటామన్నారు. అలాగే ఇళ్ల ముందు ఉన్న ఫిల్టర్ ఇసుకను సీజ్ చేసి.. గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్‌కు అప్పగించామన్నారు. అయితే ఇన్నాళ్లు ఏఈ కనీసం ఇక్కడికి వచ్చి పరిశీలించకుండానే.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు కోరారు.